
న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వీ్స్ ట్యాక్స్ (GST) తగ్గింపుపై ఆయన కీలక ప్రకటన చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధాని మోడీ శుక్రవారం (ఆగస్ట్ 15) జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దీపావళి లోపు జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గిస్తామని.. ఇందుకు జీఎస్టీలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు.
సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నాం.. దీనివల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. తద్వారా దేశ ప్రజలకు ఈ సారి డబుల్ దీపావళి బొనాంజా అందించబోతున్నామని శుభవార్త చెప్పారు. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని.. కమిటీ రిపోర్టు ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామని.. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు ఈ దీపావళిలోపు వస్తాయని చెప్పారు. దేశంలోని సామాన్య ప్రజలకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తామన్నారు. సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించేలా ఈ దీపావళి కానుక ఉంటుందని తెలిపారు.