Good News : 200లోపు యూనిట్లకు జీరో కరెంట్ బిల్లు

Good News : 200లోపు యూనిట్లకు జీరో కరెంట్ బిల్లు
  • మొత్తం బిల్లు వినియోగదారుడు కట్టాలి
  • బ్యాంకు ఖాతాలో జమ చేయనున్న సర్కారు
  •  200 లోపు యూనిట్లన్నింటికీ జీరో బిల్
  • రేపటి నుంచే ఈ రెండు స్కీమ్స్ స్టార్ట్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనుంది. చేవెళ్లలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు. ఈ పథకాల విధి విధానాలపై ప్రజల్లో గందరగోళం ఉంది. ఎవరికి వర్తింప జేస్తారు..? రూ. 500 కే సిలిండర్ ఎలా ఇస్తారు..? అమలు ఎలా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఎలా అమలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆధార్ కార్డు, సర్వీస్ నంబర్, రేషన్ కార్డు వివరాల ఆధారంగా వర్తింపజేస్తారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. దీనిపై సర్కారు క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. 

రూ. 500 సిలిండర్ ఇలా.. 

గ్యాస్ వినియోగదారుల్లో నెలకొన్ని గందరగోళంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారుకు రూ 500 కే సిలిండర్ అందేలా చర్యలు తీసుకుంటోంది.  కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.955 ఉంటే.. లబ్దిదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోను మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని సమాచారం. గ్యాస్ సిలిండర్ ధర నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంది. హైదరాబాద్‌లో రూ.955 ఉంటే.. మిగత పట్టణాల్లో రూ.970, 974గా ఉంది. ఇందుకు కారణం రవాణా చార్జీల్లో వ్యత్యాసమే. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ లభిస్తోంది. ఉదాహరణకు ఉజ్వల సిలిండర్‌ ధర రూ.970 ఉందనుకుంటే లబ్దిదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోను రూ.130ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా జమ చేస్తుంది.
  
కంపెనీలకు ‘మహాలక్ష్మి’లిస్ట్ (బాక్స్)

మార్కెటింగ్ కంపెనీలకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల జాబితాను జిల్లాల అధికారులు ఇవాళ గ్యాస్ కంపెనీలకు అందజేశారు. ఇందుకోసం ఈ మేరకు రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం ఎప్పటికప్పుడు ఆయిల్‌ కంపెనీలకు జమవుతుంది. ఆ డబ్బులు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతోపాటు లబ్ధిదారుడి ఖాతాలో జమవుతాయి. 

200 యూనిట్ల లోపు వాడితే జీరో బిల్ 

ఆరు గ్యారెంటీల్లో భాగంగా  ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనున్న మరో పథకం 200 యూనిట్లలో లోపు విద్యుత్ వినియోగించే ఇండ్లకు ఫ్రీ. సాధారణంగా ఇండ్లకు వచ్చే బిల్లింగ్ ఆపరేటర్లు బిల్ చేసి 200 యూనిట్లలోపు నమోదైతే ఆటోమేటిక్ గా జీరో బిల్ వచ్చేలా బిల్ జనరేటెడ్ మెషిన్లను సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పథకం రేపు లాంచ్ అయితే మార్చి నెలలో 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వినియోగదారులకు జీరో బిల్లు వస్తుంది.