మెచ్చుకున్న గూగుల్ అమెరికాలోను తేవాలని సూచన
డిజిటల్ పేమెంట్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) స్కీమ్, ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందుతోంది. టెక్ కంపెనీ గూగుల్ సైతం మన యూపీఐ సిస్టమ్‌ను ఆకాశానికి ఎత్తుతోంది. యూపీఐ స్కీమ్‌ను పొగడటమే కాకుండా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సైతం దాన్ని ఫాలో కావాలని సూచిస్తోంది. ఈ మేరకు ఇండియాలో యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సక్సెస్‌ను ఉదాహరణగా తీసుకుని గూగుల్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డుకు లేఖ రాసింది. అమెరికాలో డిజిటల్ పేమెంట్స్‌ను త్వరతిగతిన పెంచడానికి తీసుకొస్తోన్న ‘ఫెడ్‌నౌ’– న్యూ ఇంటర్‌బ్యాంక్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సర్వీసు(ఆర్‌టీజీఎస్) అభివృద్ధిపై ఇది పలు సూచనలు చేసింది. గూగుల్ అమెరికా, కెనడా గవర్న్‌మెంట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మార్క్ విసాకోవిట్జ్ ఈ లేఖ రాశారు. ఈయన ఇండియన్ మార్కెట్ కోసం గూగుల్ పేను అభివృద్ధి చేసే విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), ఆర్‌బీఐతో కలిసి పనిచేశారు.
ఎన్‌పీసీఐ, రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ యూపీఐను 2016లో మార్కెట్లోకి తెచ్చింది. యూపీఐ విజయంలో, దాని డిజైన్, ఆలోచనాత్మకైన ప్లానింగ్ ఉందని మార్క్ చెప్పారు. ‘తొలుత యూపీఐ ఇంటర్‌బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమే(9 బ్యాంక్‌ల పార్టనర్‌షిప్‌తో లాంచ్ అయిన యూపీఐ, ప్రస్తుతం140 బ్యాంక్‌లకు విస్తరించింది). ఆ తర్వాత ఇది రియల్ టైమ్ సిస్టమ్‌గా మారింది. ఇక చివరికి అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంటే టెక్నాలజీ కంపెనీలు కూడా యూపీఐ ఆధారిత అప్లికేషన్స్‌ను రూపొందించుకుని, బ్యాంక్‌లు నిర్వహించే అకౌంట్ల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్స్ చేసుకునేలా అనుమతిస్తున్నాయి’ అని ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ గవర్నర్స్ బోర్డు సెక్రటరీ యాన్ మిస్బ్యాక్‌కు రాసిన లేఖలో విసాకోవిట్జ్ పేర్కొన్నారు.
రూ.4.6 లక్షల కోట్లకు లావాదేవీల విలువ…
గూగుల్ పే నెలవారీ యాక్టివ్ యూజర్ బేస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడింతలు పెరిగి 6.7 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఈ యూజర్ బేస్ 2.2 కోట్లుగా ఉంది. ‘ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్–క్యూ3 2019’ పేరుతో వరల్డ్‌లైన్ విడుదల చేసిన రిపోర్ట్‌లో ఇండియాలో యూపీఐ లావాదేవీల మొత్తం వాల్యుమ్ 2019 క్యూ3లో 270 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 183 శాతం పెరిగాయి. వాల్యు పరంగా చూసుకుంటే, 2018 క్యూ3 నుంచి 189 శాతం పెరిగి రూ.4.6 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
135.2 బిలియన్ డాలర్లకు డిజిటల్ పేమెంట్స్..
అసోచామ్–పీడబ్ల్యూసీ ప్రకారం ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ 2023లో 135.2 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయని తెలిసింది. ఈ ఏడాది ఇవి 64.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే వార్షికంగా 20.2 శాతం వృద్ధిని సాధిస్తున్నాయన్నమాట. ఇండియా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ నుంచి నేర్చుకున్న పాఠాలతో గూగుల్, ఫెడ్ రిజర్వ్‌కు పలు సూచనలు చేసింది.
