
వాషింగ్టన్: పిల్లల ప్రైవసీ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు గూగుల్ భారీ జరిమానాను చెల్లించబోతున్నట్టు తెలుస్తోంది. చిల్డ్రెన్స్ ప్రైవసీ రూల్స్‌కు విరుద్ధంగా ప్రకటనలు మరిన్ని రావాలన్న లక్ష్యంతో వారి డేటాను గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ)తో గూగుల్ సెటిల్మెంట్ కుదుర్చుకుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. సుమారు ₹1,076 కోట్లు (15 కోట్ల డాలర్లు) నుంచి ₹1434.8 కోట్లు (20 కోట్ల డాలర్లు) దాకా చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ సెటిల్మెంట్ గురించి ఎఫ్‌టీసీ ప్రకటన చేసే అవకాశముంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే 13 ఏళ్ల లోపు పిల్లల డేటాను సేకరించి ప్రైవసీ చట్టాలను యూట్యూబ్ ఉల్లంఘించిందని కొన్ని ప్రైవసీ గ్రూప్‌లు ఆరోపించాయి.