
గోపాలా గోపాలా సినిమా గుర్తుంది కదా. తనకు జరిగిన నష్టానికి కారణం దేవుడేనని.. ఏకంగా దేవుడిపైనే కేసు వేస్తాడు ఆ హీరో. సేమ్ అలాంటి స్టోరీనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దేవుడి వల్లనే తన పరిస్థితి ఇలా ఉందని దేవుడిపై పగ తీర్చుకున్నాడు. పోలీసులు అరెస్టు చేయడంతో షాకింగ్ విషయాలు చెప్పాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది.
చత్తీస్ గఢ్ లో గురువారం (ఆగస్టు 28) 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. యాక్ట్ ఆఫ్ రివెంజ్ అగెనిస్ట్ గాడ్.. పేరుతో అతడు చేసిన పనులను చూసి షాకయ్యారు. గురువారం ఒక గుడిలోని హుండీలో ఉండే డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు పోలీసులు. దేవుడిపై రివెంజ్ తీసుకోవడానికి డబ్బులు తీసుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ వ్యక్తి హెచ్ఐవీ (HIV) పాజిటివ్. తనకు హెచ్ఐవీ సోకడానికి కారణం.. తను ఈ స్థితిలో ఉండటానికి కారణం దేవుడేనని ఆరోపించాడు. అందుకే చాలా ఏళ్లుగా దేవుడి గుడులలో హుండీలనుంచి డబ్బులు చోరీ చేస్తున్నట్లు చెప్పాడు.
2012లో జైల్లో హెచ్ఐవీ:
2012లో అరెస్టు కావడంతో చాలా రోజులు జైల్లో ఉన్న ఈ వ్యక్తికి.. అక్కడే హెచ్ఐవీ సోకినట్లు పోలీసుకు చెప్పాడు. 2012లో వేధింపుల కేసుల అరెస్టైన తర్వాత జైల్లో హెచ్ఐవీ సోకినట్లు చెప్పాడు.
హెచ్ఐవీ రావడంతో దేవుడిపై నమ్మకం కోల్పోయా:
తనకు ఈ వ్యాధి వచ్చిన తర్వాత దేవుడిపై.. మతంపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయానని చెప్పాడు. దుర్గ్ పట్టణంలోనూ.. చుట్టు పక్కల ప్రాంతాలలోనూ దాదాపు 10 కి పైగా హుండీలలో దొంగతనం చేసినట్లు చెప్పాడు. చెప్పిన వాటికంటే ఎక్కువ దొంగతనాలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
దొంగతనంలోనూ నిజాయితీ:
దేవుడిపై కక్ష్యతో.. రివెంజ్ తీసుకుంటున్న వ్యక్తి.. దొంగతనంలోనూ నిజాయితీ చూపించాడు. హుండీల నుంచి కేవలం డబ్బులు మాత్రమే కొట్టేసేవాడు. బంగారం, వెండి మొదలైన విలువైన ఆభరణాలు, వస్తులు మళ్లీ అందులోనే పడేసేవాడు. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తు పట్టకుండా ఉండేందుకు టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు.. వెళ్లే టప్పుడు ఒక డ్రెస్సు వేసుకుని మేనేజ్ చేసేవాడు. గుడికి కొంత దూరంలో జూపిటర్ స్కూటర్ ఆపి.. దొంగతనం చేసి వచ్చేవాడట.
ఆగస్టు 23-24 తేదీలలో దుర్గ్ సమీపంలోని జైన ఆలయంలో దొంగతానికి పాల్పడుతూ దొరికిపోయాడు. అరెస్టు చేసిన పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
హెచ్ఐవీ సోకడంతో తినటానికి, బతకడానికి, మందులకు అయ్యే ఖర్చులకు దోపిడీల మీద ఆధారపడ్డాడు. దీంతో దేవుడి హుండీలనే టార్గెట్ చేసి డబ్బులు మాత్రమే తీసుకునేవాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు. అందుకే దేవుడి హుండీ నుంచి కొట్టేసి జీవనం గడుపుతున్నానని చెప్పాడు పోలీసులకు.