- పెద్దశంకరంపేటలో బీజేపీ, హిందూ సంఘాల నిరసన
పెద్దశంకరంపేట, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆదివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 161 మీద ఉన్న దాబా దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు.
విషయం తెలిసిన వెంటనే మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ నేతృత్వంలో బీజేపీ, హిందూసంఘాల నాయకులు, కార్యకర్తలు పీఎస్ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి పిట్లం-బిచ్కుంద వైపు వెళ్తున్న బస్సును ఆపివేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు బస్సు అద్దంపై చేతితో గుద్దడంతో స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి.
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. కార్యకర్తలను కలిసి కరచాలనం చేయడం ఆనందంగా ఉందన్నారు. సీఐ రేణుక రెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
