ఎమ్మెల్యే రాజాసింగ్ దారెటు.? అనర్హత వేటు పడుతుందా..?

ఎమ్మెల్యే రాజాసింగ్  దారెటు.?  అనర్హత వేటు పడుతుందా..?
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న రాష్ట్ర నేతలు
  • అనర్హత వేటు కోసం స్పీకర్ కు లేఖ రాసే యోచనలో పార్టీ
  • ప్రస్తుతం అమర్ నాథ్ యాత్రలో ఎమ్మెల్యే  రాజాసింగ్
  • హాట్ టాపిక్ గా గోషామహల్ ఎమ్మెల్యే రాజకీయ భవితవ్యం

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఆదేశాలతో కూడాన లేఖను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఆయన శాసన సభ్యత్వంపైనా వేటు వేసేలా స్పీకర్ కు లేఖ రాయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.  గత నెల 30న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన తాను బరిలో నిలువకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యే కావడంతో రాజీనామా లేఖను జాతీయ నాయకత్వానికి  పంపారు. 11 రోజుల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం రాజీనామాను అంగీకరించింది. 

వాట్ నెక్స్ట్

బీజేపీ జాతీయ నాయకత్వం రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ మొదలైంది. శివసేనతో టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తాను హిందుత్వ ఎజెండాను వదలబోనని పదే పదె చెప్తున్న రాజాసింగ్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆ ఎజెండాతో పనిచేసే శివసేనలోనే చేరుతారనే చర్చ విస్తృతంగా ఉంది. లేదా బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి మళ్లీ పార్టీలో జాయిన్ అయ్యేందుకు  ప్రయత్నిస్తారనే చర్చ కూడా మరో వైపు ఉంది. రాజాసింగ్  ప్రస్తుతం అమర్ నాథ్ యాత్రలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

వేటు పడుతుందా..?

రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీ తరఫున గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన  పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాజీనామాను ఆమోదించినందున ఆయన స్పీకర్ ఫార్మాట్ లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వస్తుందని సమాచారం. ఒక వేళ ఆయన రాజీనామా చేయని పక్షంలో బీజేపీ నాయకత్వం స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపై రాజాసింగ్ శాసన సభ్యత్వం ఆధారపడి ఉంటుంది.   గోషామహల్ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అంత ఈజీ కాదనేది విశ్లేషకుల మాట.

►ALSO READ | బీఆర్ఎస్ లో బీసీ బిల్లుపై గందరగోళం