
- భారత జాగృతి ఆఫీసులో సంబురాలు
- తమ విజయమంటున్న ఎమ్మెల్సీ కవిత
- రంగులు చల్లుకొని డ్యాన్సులు చేసిన లీడర్లు
- ఆర్డినెన్స్ పై తెలంగాణ భవన్ లో గులాబీ నేతల ఆగ్రహం
- కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్
హైదరాబాద్: స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు దిశగా రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది . బీసీ రిజర్వేష్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, ఇందుకోసం 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. 42 శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు.
కేబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే జాగృతి కార్యాలయానికి కార్యకర్తలు, కవిత, ఇతర నాయకులు చేరుకొని ఇది తాము సాధించిన విజయమని పేర్కొంటూ సంబురాలు చేసుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ భారత జాగృతి పోరాటం చేసిందని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు. ఇదిలా ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రెస్ మీట్ పెట్టి సర్కారు తీరును తప్పు పట్టారు. ఆర్డినెన్స్ తో రిజర్వేషన్లు సాధ్యం కావని చెబుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్డినెన్స్ పేరుతో మంత్రి వర్గం చేతులు దులుపుకుంటుందని ఆరోపిస్తున్నారు.
►ALSO READ | HCA స్కాంలో రూ. 170 కోట్ల గోల్ మాల్ జరిగింది
ఆర్డినెన్స్ లు చట్ట బద్దత కాదు, కోర్టులో నిలబడవని అంటున్నారు. తమిళనాడు తరహా కాకుండా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ చట్ట బద్దత ఇవ్వాలని మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పామంటున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ బీసీ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కానున్నారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత తెచ్చేందుకు ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తేవాలన్న అంశంపై కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొంటున్న భారత జాగృతి అధ్యక్షురాలు సంబురాలు చేసుకోవడం, బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.