- ఆపై రెండు ముక్కలుగా చేసి చెరువులో పడేసిండు
- ఏమీ తెలియనట్టు పీఎస్‌లో మిస్సింగ్ కంప్లయింట్
- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం
- నిందితుడితోపాటు సహకరించిన ఇద్దరు అరెస్ట్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఆస్తి కోసం అక్కను దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని రెండు ముక్కలుగా రంపంతో కోసి చెరువులో పడేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఆ తమ్ముడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌కు చెందిన లీలాదేవి(40) ఇరవై ఏండ్ల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఎల్బీనగర్ లో కొన్నేళ్లు నివాసముంది. పదేండ్ల కింద భర్త చనిపోవడంతో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి వచ్చి రాజస్థాన్‌కే చెందిన తన చిన్నాన్న కొడుకైన పప్పు రామ్ కుమావత్, అతడి భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది.
ఇందులోనే చిన్న షట్టర్లో కిరాణ షాపు నడుపుకుంటోంది. పప్పురామ్ కూడా బాటసింగారంలోని మెయిన్రోడ్లో కిరాణ షాపు పెట్టుకున్నాడు. లీలాదేవికి పిల్లలు ఎవరూ లేరు. పప్పురామ్కు స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం కింద లీలాదేవి తన తమ్ముడైన పప్పురామ్తో కలిసి ఓ ప్లాటును కొనుగోలు చేసింది. అయితే, పప్పు రామ్ తన ఒక్కడి పేరు మీదే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో తన వాటా కోసం లీలావతి అడగడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత నెల 28న ఇంట్లో ఎవరూ లేని టైంలో లీలాదేవిని.. పప్పురామ్గొంతు నులిమి హత్య చేశాడు. ఇండిపెండెంట్హౌస్కావడంతో పిల్లలు, భార్య ఉన్నా.. ఇంటి బయట మెట్ల కింద వినియోగించకుండా ఉన్న మరో వాష్ రూమ్ లో అక్క డెడ్ బాడీని రెండు రోజులపాటు దాచి ఉంచాడు. తర్వాత దుర్వాసన వచ్చి, చుట్టుపక్కల వారు పిల్లలు గుర్తిస్తారని భయపడి బాడీని దూరంగా పారవేయాలని అనుకున్నాడు. మృతదేహాన్ని రంపం తీసుకువచ్చి రెండు ముక్కలుగా కోశాడు. ఒక కవర్లో మొండెం నుంచి తల వరకు, మరో కవర్లో నడుం దగ్గరి నుంచి కాళ్ల వరకు వేరు చేసి వేశాడు. ఈ రెండు మూటలను తీసుకువెళ్లి మజీద్ పూర్ గ్రామ సమీపంలోని అక్కచెల్లెళ్ల చెరువులో పడేశాడు.
మిస్సింగ్ అంటూ డ్రామా..
అక్క గురించి బంధువులు అడుగుతారని భావించిన పప్పు రామ్ కొత్త ప్లాన్వేశాడు. వెంటనే ఏమీ తెలియనట్లు జోధ్పూర్వెళ్లి ‘అక్క వచ్చిందా? అక్కడ కనిపించడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చిందేమోనని వెతకడానికి వచ్చా.. ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పండి’ అని దొంగ ఏడ్పులు ఏడ్చాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్ పోలీస్‌స్టేషన్‌లోనే కంప్లయింట్ఇవ్వాలని చెప్పడంతో ఈ నెల 8న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మిస్సింగ్ కేసు ఫైల్చేశాడు. అయితే, పప్పురామ్‌పై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో తన అక్కకు ఎవరూ లేరని, ఆమెను చంపితే ప్లాట్గొడవ ఉండదని, బంగారం, డబ్బు కూడా తనకే దక్కుతుందని భావించి చంపానని ఒప్పుకున్నాడు. బుధవారం పోలీసులు చెరువులో గాలించి మృతదేహం భాగాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పప్పు రామ్ కు ఈ హత్యలో సహకరించిన రాకేశ్, సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
