హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీలోని పాడేరు నుంచి హైదరాబాద్‌కు హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న వ్యక్తిని నందనవనం ఫారెస్ట్ నారపల్లి ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువ చేసే 1.04 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే పంజాగుట్ట, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఇతడు ఐదేండ్లుగా హాష్ ఆయిల్ ను పాడేరు నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నాడని మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్ తెలిపారు.
గోవా లిక్కర్ పట్టివేత..
గోవా నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను తీసుకువచ్చి నల్గొండ జిల్లాలో అమ్ముతున్న ముగ్గురిని ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ బీ టీం శ్రీశైలం హైదరాబాద్ రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో జానీ, గిరి, రాకేశ్ మద్యం తీసుకువస్తూ పట్టుబడ్డారు. విలువ రూ. 34 లక్షలు ఉంటుందని ఎస్టీఎఫ్ బి టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.
తాండూర్‌లో 3.6 కేజీల గంజాయి
తాండూర్: తాండూరులోని గౌతాపూర్ స్టోన్ పాలిషింగ్ ఏరియాలో గంజాయి విక్రయిస్తున్న ముస్తాకిమ్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి కిరాయి ఇంట్లో సోదాలు నిర్వహించగా, సుమారు 90 వేల రూపాయల విలువైన 3.66 కిలోల గంజాయి లభ్యమైంది. బీహార్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఇక్కడి స్టోన్ పాలిషింగ్ కూలీలకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు.
