- అంబేద్కర్ సేన, మాల సంఘాల ఆగ్రహం
- రోస్టర్ విధానం రద్దు చేయాలని డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాలను దూరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ది నేషనల్ అంబేద్కర్ సేన, మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు తాలూకా రాజేశ్, మాల మహానాడు అధ్యక్షుడు తాళ్లపల్లి రవి తదితరులు మాట్లాడారు. రోస్టర్ విధానం రద్దుపై అసెంబ్లీలో చర్చించాలని, చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు.
అనంతరం సీఎం వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు. అణగారిన మాలల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని, ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. వినయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కల్యాణ్ రామ్, కమల్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.
