గౌరవెల్లి నిర్వాసితుల చేతులకు సంకెళ్లు

గౌరవెల్లి నిర్వాసితుల చేతులకు సంకెళ్లు

ఏదైనా నేరం, దొంగతనం, ఇతర అఘాయిత్యాలకు పాల్పడిన వారికి సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు పరుస్తారనే సంగతి తెలిసిందే. కానీ.. భూముల విషయంలో ఆందోళన చేసిన వారికి సంకెళ్లు వేసి కోర్టుకు హాజరు పరచడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్లు ఏ నేరం చేశారని ప్రశ్నిస్తున్నారు. సంకెళ్లతో వాళ్లు ఉండడం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో భూ నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.

అరెస్టు అయిన బద్దం శంకర్ రెడ్డి, అంగేటి తిరుపతి రెడ్డి, రాగి శ్రీనివాస్ యాదవ్, సుకృ నాయక్ లను హుస్నాబాద్ కోర్ట్ లో హాజరుపర్చారు పోలీసులు. ఈ సందర్భంగా తమ వారిని చూసేందుకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు కోర్టుకు తరలివచ్చారు. కానీ.. వారికి బెయిల్ మంజూరు కాలేదు. దీంతో వారిని మళ్లీ జైలుకు తరలించారు. ఆ సమయంలో వారి చేతులకు బేడీలు ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. కరుడుగట్టిన దొంగలు, ఉగ్రవాదులకు బేడిలు వేసినట్లు... రైతులు, గ్రామస్తులకు బేడిలు వేయటాన్ని తప్పుపడుతున్నారు గ్రామస్తులు. తమ వాళ్లను సంకెళ్లలో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.