- ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్‌లో కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నరు
- మరో 241 టీఎంసీలు అడిగినా కేటాయించేవాళ్లు
- ‘వీ6 వెలుగు’ ఇన్నర్వ్యూలో జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరాం
- 811 టీఎంసీలను ముట్టుకోవద్దని విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పేర్కొన్నది
- పాలమూరు– రంగారెడ్డికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన లెక్కలు ఇవ్వలేదు
- బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు మరో ఏడాదిలో వచ్చే అవకాశముందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని జలవనరుల నిపుణుడు, మహారాష్ట్ర సర్కారు సలహాదారు వెదిరె శ్రీరాం అన్నారు. 2015లో మీటింగ్ జరిగినప్పుడు 299 టీఎంసీల ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోకుండా ఉండాల్సిందన్నారు.
299 టీఎంసీలతోపాటు పాలమూరు –రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లాంటి ప్రాజెక్టులకు మరో 241 టీఎంసీలు డిమాండ్ చేస్తే నీటి కేటాయింపులు వచ్చేవని తెలిపారు. ఇటు నీటి పంపకాలను తెలంగాణ, ఏపీ మధ్యే చేసేలా కొత్త ట్రిబ్యునల్ లేదా సెక్షన్ 3 ఫర్దర్ టర్మ్స్ ఇస్తామని కేంద్రమంటే అప్పటి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసి లేట్ చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా రెండు రాష్ట్రాల మధ్యే తేల్చుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు.
అయినా కూడా కేసు వాపస్ తీసుకునేందుకు కేసీఆర్ ఏడాది లేట్ చేశారని పేర్కొన్నారు. ఫలితంగా ఏటేటా 299 టీఎంసీల నీళ్లకే సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై ‘వీ6 వెలుగు’ ఇన్నర్వ్యూలో వెదిరె శ్రీరాం మాట్లాడారు.
తెలంగాణ వచ్చినా నీటి వాటాలు ఎందుకు తేలలే?
ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను కేటాయించింది. ఆ కేటాయింపుల్లో తెలంగాణ, ఏపీ వాటాలను తేల్చాలి. ఇప్పుడున్న బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ వాటాలను తేల్చే పనిలో ఉంది. అయితే, ఆ 811 టీఎంసీల కేటాయింపులను ముట్టుకోవద్దని, దానిపైన ఎన్ని నీళ్లున్నాయో వాటినే పంచాలని ఏపీ విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పేర్కొన్నది.
దాని ప్రకారమైతే ఏపీ విభజనకు ముందు మన నీటి వినియోగం ఎంతుందో దాని ప్రకారం తప్ప.. ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఏపీకి మధ్య 811 టీఎంసీల కేటాయింపుల్లో వాటా తేలాలంటే 2 రాష్ట్రాల కోసం కొత్త ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం చెప్పింది. లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపులు జరపాలంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఇస్తామని తెలిపింది.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్నాటకలనూ వాదనల్లో చేర్చాలని డిమాండ్ చేసింది. మొత్తం కృష్ణా జలాలను పున:పంపిణీ చేయాలని కోరింది. ఇటు 2015లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. కర్నాటక, మహారాష్ట్రకు ఇప్పటికే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసిందని సుప్రీంకోర్టు చెప్పింది.
గొడవ తెలంగాణ, ఏపీ మధ్యనే కాబట్టి రెండు రాష్ట్రాలు తేల్చుకోవాలని సూచించింది. దీంతో మొత్తం జలాలను పంపిణీ చేసేందుకు అవకాశం దక్కలేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తగ్గి రెండు రాష్ట్రాల మధ్యే కేటాయింపులు చేసుకునేలా ఒప్పుకోవాల్సింది. కానీ, అలా చేయలేదు. 2015లో సుప్రీంకోర్టులో కేసు వేస్తే.. 2021 వరకు వాపస్ తీసుకోలేదు. అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఎన్నిసార్లు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినా.. ఆయన వినిపించుకోలేదు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఒప్పుకున్నా.. కేసును వాపస్ తీసుకోవడానికి ఏడాది టైం తీసుకున్నరు. దీంతో కేంద్రం 2023లో సెక్షన్ 3 ప్రకారం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను జారీ చేసింది. దాని ప్రకారం ఇప్పటికే ఉన్న 811 టీఎంసీలు, కర్నాటక, మహారాష్ట్ర సహా 4 రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల్లో మిగిలిన 194 టీఎంసీలు, గోదావరి డైవర్షన్‌లోని 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు కలిపి 1,050 టీఎంసీలకు ప్రస్తుతం బ్రజేశ్ ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. ఏడాదిలో మళ్లీ రీ అలొకేషన్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.
పదేండ్లలో నీటివాటాల విషయంలో తెలంగాణకు న్యాయం జరగలేదు. లోపం ఎక్కడున్నట్టు?
2015లోనే రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే అప్పుడే కేంద్రం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి ఉండేది. కానీ, విభజనచట్టం ప్రకారం పాత కేటాయింపులను ముట్టుకోవద్దని నాటి ప్రభుత్వం నిబంధన పెట్టింది. యూపీఏ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ఆ కేటాయింపులను ముట్టుకోలేని పరిస్థితి. ఆ నీళ్లకుపైన ఇంకెన్ని నీళ్లుంటాయి.
విభజనచట్టం ప్రకారమే ముందుకెళ్తే మనకు జరిగే న్యాయం శూన్యం. మొత్తం కేటాయింపులను రీఅలొకేట్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశాడా? అది ఎంతవరకు నిజం?రెండు రాష్ట్రాల మధ్య ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది.
అందుకు తగ్గట్టుగానే 2015లో తెలంగాణ, ఏపీలతో కేంద్రం మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో అప్పటికే తెలంగాణకు వినియోగంలో ఉన్న నీళ్లతోపాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు– రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు కేటాయింపులు ఇస్తమని చెప్పినం. అప్పటికే ఆ ప్రాజెక్టులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉన్నది.
అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినా ఆయా ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తరన్నది చెప్పలేదు. ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లో ట్రిబ్యునల్ కేటాయింపుల్లో ఎన్ని నీళ్లు ప్రాజెక్టులకు వాడుకుంటరు.. హైడ్రాలజీ లెక్కలను చెప్పాల్సి ఉంటుంది. కానీ, అలా చేయలేదు. ఈ కొత్తగా ప్రతిపాదించిన ఆరేడు ప్రాజెక్టులకు అదనంగా 261 టీఎంసీల నీళ్లు కావాలి.
అందులో 20 టీఎంసీలు భీమాకు కేటాయించారు. ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు 299 టీఎంసీలతోపాటు.. మిగతా 241 టీఎంసీలకూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉండాల్సింది. తక్కువ నీళ్లు ఇస్తే మనం మీటింగ్ నుంచి వాకౌట్ చేసి రావాల్సింది. అప్పుడు నేను కేంద్రంలో సలహాదారుగా ఉన్నాను.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారుగా ఉన్న విద్యాసాగర్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఇతర అధికారులు నాతో సమావేశమయ్యారు. తక్కువ నీళ్లకు ఒప్పుకోకుంటే మీటింగ్ నుంచి వాకౌట్ చేసే అవకాశం మనకుంది అని చెప్పాను. కానీ, ఆనాడు ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేదు.
ఒకవేళ ఆ రోజు 299తోపాటు 241 టీఎంసీలకు మనం డిమాండ్ పెట్టి ఉంటే ఆ నీళ్లు వచ్చేవా?
వస్తాయా? రావా? అన్నది ఏపీ ఒప్పుకునే దాన్ని బట్టి లేదంటే మోడరేటర్‌గా ఉన్న కేంద్రం నిర్ణయం ఆధారంగా ఉంటుంది. కేటాయింపులు రావాలంటే ఫస్ట్ మనం డిమాండ్ వినిపించాలి కదా? ఒకవేళ ఏపీ ఒప్పుకోవట్లేదంటే మేం కూడా 299 టీఎంసీలకు ఒప్పుకోబోమని చెబుతూ వాకౌట్ చేయొచ్చు.
అప్పుడు 811 టీఎంసీల్లో మనం ఎన్ని వాడుకున్నా ఎవరూ ఏమనేటోళ్లు కాదు కదా. ఒప్పందాలపై సంతకం చేసినం కాబట్టి లీగల్‌గా అవకాశం కోల్పోయినం. 2016లో కేసీఆర్, చంద్రబాబు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఆ ఏడాది పాత కేటాయింపులకే ఒప్పుకున్నరు. ఆ తర్వాత వరుసగా అవే కేటాయింపులకు సంతకాలు పెట్టారు.
అందుకే 299 టీఎంసీలకు లీగల్‌గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. వాటర్ అలొకేషన్ తెచ్చుకోకుంటే అవన్నీ అక్రమ ప్రాజెక్టులుగానే ఉండిపోతాయి.
పాలమూరు ప్రాజెక్టుకు అన్యాయం చేసిందెవరు?
శ్రీశైలం కింద ఏపీ కట్టినవన్నీ లీగల్ ప్రాజెక్టులే. వాటికి కేవలం 34 టీఎంసీల కేటాయింపులే ఉంటే.. 400 టీఎంసీలు వాడుకుంటున్నది. పాలమూరు– రంగారెడ్డి విషయంలో ఇలా జరగలేదు. 2020లో ప్రాజెక్టుల పరిధిని తేల్చేందుకు కేఆర్ఎంబీకి అధికారం ఇచ్చాం. ఆనాడు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాలని మేం రెండు రాష్ట్రాలనూ అడిగాం. పాలమూరు ప్రాజెక్టుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించింది. అప్పుడు నీటి కేటాయింపులను అందులో పేర్కొనలేదు.
దీంతో గోదావరి డైవర్షన్‌లో కేటాయించిన 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున నేను సలహా ఇచ్చాను. మిగతా 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్‌లో 90 టీంఎసీల కేటాయింపులున్నాయి.. అందులో సేవింగ్స్ ద్వారా వచ్చే నీళ్లను వాడుకుంటామని చెప్పారు. కానీ, సేవింగ్స్ అనకండి అని మేం చెప్పాం.
అలాగైతే ట్రిబ్యునల్ కేటాయింపుల్లో కోతపడే అవకాశం ఉందని సూచించాం. సోదరభావంతో ఇవన్నీ చెబితే.. అప్పుడు మళ్లీ డీపీఆర్కొత్తగా ఇచ్చారు. 45 టీఎంసీలకు సంబంధించి చెరువులవారీగా వివరాలివ్వాలని సీడబ్ల్యూసీ అడిగితే. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.
జిల్లాలు లేదా మండలాలవారీగా లెక్కలిస్తామని చెబుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం మండలాలవారీగా లెక్కలిచ్చింది. అవి రాకుండా డీపీఆర్‌కు అప్రూవల్ఎట్లిస్తరు?
పాలమూరుకు అన్యాయం చేసిందెవరు?
నేను నిజాలు చెబుతున్నా. దాన్ని బట్టి అన్యాయం చేసిందెవరని ప్రజలు తేల్చుకోవాలి. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో.. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు తప్ప.. పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీలాంటి ప్రాజెక్టులపై కొంచెమైనా ఫోకస్ పెట్టి ఉంటే పూర్తయ్యేవి. కల్వకుర్తి ప్రాజెక్టుకు 43 టీఎంసీలు కావాలి. దానితో చివరి ఆయకట్టుకు నీళ్లందుతున్నాయా? అంటే లేదు.
దానిని పూర్తి చేయడానికి నాలుగైదువేల కోట్లు కూడా ఖర్చు కావు కదా? కాళేశ్వరానికి రూ.1.30 లక్షల కోట్లు పెట్టినదాంట్లో పదివేల కోట్లు పెట్టిఉంటే పూర్తయ్యేవి. గోదావరిలో 968 టీఎంసీల కేటాయింపులున్నాయి. అక్కడ ప్రాజెక్టులన్నీ కట్టుకోవచ్చు. అందుకుతగ్గట్టు వాడకం కూడా లేదు. వీటిమీద తర్వాత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.
