వికారాబాద్, వెలుగు: వికారాబాద్జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనుల నేపథ్యంలో కుడి కాలువ కింది ఆయకట్టు రైతులకు 2025–26 యాసంగి సీజన్‌కు పంట సెలవు దినంగా ప్రకటించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం తెలిపారు.1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఏండ్లుగా చిన్న రిపేర్లు మాత్రమే జరిగాయని, ఆధునీకరణ జరగలేదని పేర్కొన్నారు. కాంక్రీట్ సిమెంట్ లైనింగ్, గైడ్ వాల్స్ నిర్మాణం, బలోపేతం అవసరమన్నారు. 2025–26 రబీ సీజన్లో కుడి కాలువతో ప్రారంభించి ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
కుడి కాలువలో 24 కి.మీ. పొడవు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి నీటి పారుదల సామర్థ్యం మెరుగుపరచి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం చేకూర్చేలా చేస్తామన్నారు. పనులు సులభతరంగా చేయడానికి కాలువలో నీటి విడుదల నిలిపివేశామని, వరి సాగు కోసం కాలువ నీటిపై ఆధారపడిన రైతులు ఈ సీజన్లో వరి పంట సాగు నిలిపివేయాలని సూచించారు.
