వరంగల్, వెలుగు: వరంగల్ మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూములను శనివారం ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‍పోర్ట్ పునర్నిర్మాణం చేపట్టడంలో భాగంగా ఇప్పటికే రైతుల నుంచి 253 ఎకరాల భూములను సేకరించింది. దీని కోసం రూ.295 కోట్లు కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ.కోటి 20 లక్షల పరిహారం చెల్లించింది. మొత్తంగా ఏడాది సమయంలోనే భూసేకరణ పూర్తయింది.
ఏఏఐ అధికారులకు భూములకు సంబంధించిన పత్రాలు అందించాల్సి ఉంది. దీంతో శనివారం ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు బృందం మొదట వరంగల్ కలెక్టరేట్ చేరుకుని అధికారులతో సమావేశమైంది. అనంతరం వరంగల్ ఆర్డీవో సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్‍అండ్‍బీ జిల్లా అధికారి రాజేందర్‍తో కలిసి మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూముల సరిహద్దులను పరిశీలించారు. త్వరలోనే భూబదాలయింపు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
