- డీఎంహెచ్వో అనిత
నస్పూర్, వెలుగు: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో చేసిన స్కానింగ్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్, డీఎంహెచ్వో అనిత ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, పీసీపీ యాంటీ యాక్టివిటీస్పై కలెక్టరేట్లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. జిల్లాలో 53 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి కేంద్రంలో స్కానింగ్ నిర్వహిస్తున్న డాక్టర్ల వివరాలు నమోదై ఉండాలన్నారు. లింగ నిర్ధారణను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలను ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గర్భవతులకు చేసే స్కానింగ్, సూపర్ స్పెషా లిటీ డాక్టర్లు చేస్తున్న స్కానింగ్ వివరాలను జిల్లా వైద్యారోగ్యశాఖ ఆఫీసుకు తెలియజేయాల న్నారు. కార్యక్రమంలో హీల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఎన్జీవో డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, గైనకాలజిస్ట్ నలుమాసు శ్రీదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు, ఫిజీషియన్లు, డీపీవో ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
