దేశవ్యాప్తంగా 37 కేసులు..సైబర్ నేరగాడి అరెస్ట్

దేశవ్యాప్తంగా 37 కేసులు..సైబర్ నేరగాడి అరెస్ట్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: దేశ వ్యాప్తంగా సైబర్​నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని ఆదిలాబాద్​ జిల్లా మావల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్సై రాజశేఖర్ ​రెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని అంబర్​పేటకు చెందిన మహమ్మద్ ఫారూఖ్ మరణించిన వారి కుటుంబసభ్యులకు సహాయం చేస్తామని నమ్మించి దేశవ్యాప్తంగా సైబర్​ మోసాలకు పాల్పడుతున్నాడు. 

ఆదిలాబాద్​లోని కైలాస్​నగర్​కు చెందిన మహమ్మద్ అఖీల్ అహ్మద్​కు ఈ నెల 8న నిందితుడు వాట్సాప్​ కాల్​చేసి చనిపోయిన మీ అన్న అస్లాం మౌలానాకు తాను శ్రేయోభిలాషినని చెప్పి మాట్లాడాడు. అనంతరం రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నకిలీ ట్రాన్సాక్షన్ స్ర్కీన్​ షాట్లు పంపాడు. అనంతరం వివిధ కారణాలు చెప్పి కొన్ని డబ్బులు తిరిగి పంపమని కోరాడు. 

దీంతో బాధితుడు అఖీల్​ విడతల వారీగ రూ.58,500 నిందితుడికి పంపాడు. చివరకు మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మావలలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫారూఖ్​పై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, బిహార్​లో 37 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ ​నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.