కొత్త జీఓలో మార్పులు అవసరమైతే సరిచేస్తాం

కొత్త జీఓలో మార్పులు అవసరమైతే సరిచేస్తాం
  • తెలంగాణలోనే జర్నలిస్టులకు అత్యధిక ప్రయోజనాలు
  • ఫీల్డ్, డెస్క్​ మీడియాలకు ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదు
  • టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) వినతికి మంత్రి పొంగులేటి హామీ

ఖమ్మం, వెలుగు: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టులకు అత్యధిక ప్రయోజనాలు కల్పించేది తెలంగాణ రాష్ట్రమేనని, కొత్త జీఓ252లో ఏమైనా మార్పులు అవసరమైతే సరిచేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన 252 జీఓను సవరించాలని కోరుతూ ఖమ్మం రూరల్​మండలం తరుణి హట్​లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జర్నలిస్ట్​ సంఘం నేతలతో మాట్లాడారు.

 ప్రభుత్వం జారీ చేసిన జీఓలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నా, మార్పులు అవసరమనిపించినా వెనుకడుగు వేయకుండా సరి చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్​ కార్డుల విషయంలో ఫీల్డ్​ మీడియా వారికి, డెస్క్​ జర్నలిస్టులకు ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష, తేడా ఉండదని స్పష్టం చేశారు. డెస్క్​ కార్డులున్న వారికి కూడా మీడియా కార్డులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో జర్నలిస్టుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

పెద్ద పత్రికలకు అక్రిడిటేషన్​ కార్డుల కేటాయింపు తగ్గిందని చెబుతున్నారని, దానిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, నేతలు వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్​రెడ్డి, వనం నాగయ్య, ఎం. ఉపేందర్, హరీష్రాజు, గుద్దేటి రమేశ్, నల్లమోతు శ్రీనివాస్​, విజేత, రమణ, పాలేరు నియోజకవర్గ ఇన్​చార్జి ఉపేందర్, వెంకన్న, గురుమూర్తి తదితరులున్నారు.