చీకట్లో ఉంటే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది ; ఎమ్మెల్యే పాయల్ శంకర్

చీకట్లో ఉంటే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది ; ఎమ్మెల్యే పాయల్ శంకర్
  •     జోగు రామన్నపై ఎమ్మెల్యే పాయల్​ శంకర్ ​విమర్శలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జోగు రామన్న ఇంకా చీకట్లోనే ఉంటూ వైభోగాలు అనుభవిస్తున్నాడని,  అందుకే తాను చేస్తున్న అభివృద్ధి పనులు ఆయనకు కనిపించడం లేదని ఎమ్మెల్యే పాయల్ ​శంకర్​ విమర్శించారు. అదిలాబాద్ రూరల్ మండలం హత్తిగుట్ట సర్పంచ్ గెడం రేణుక, ఉప సర్పంచ్ కొడప సీతారాం, వార్డ్ మెంబర్లు శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. 

వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జోగు రామన్న అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆదివాసీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించక వారిని మోసం చేశాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క ఆదివాసీకి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని, కానీ మాజీ మంత్రి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

మంత్రిగా ఉండి కనీసం రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం నిధులు తీసుకురాలేకపోయారని, ఎయిర్ పోర్టు కోసం స్థలాన్ని సైతం సేకరించలేకపోయారని విమర్శించారు. హత్తిగుట్టలో ప్రధానమంత్రి జన్​మన్ పథకం కింద 40 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు దయాకర్, నాయకులు రవి, అశోక్ రెడ్డి, ముకుంద, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.