బిజినెస్ డెస్క్, వెలుగు: మరికొన్ని రోజుల్లో మొదలయ్యే కొత్త సంవత్సరంపై అందరికీ ఆశలు ఉంటాయి. చాలా మంది పొదుపునుపెంచాలని కోరుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలని ఒట్టు పెట్టుకుంటారు. తెలిసో తెలియకో చివరికి కొన్ని ఆర్థిక పరమైన ఉచ్చుల్లో చిక్కుకుంటారు. చిన్న చిన్న పొరపాట్లు పదే పదే చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం క్రమంగా దెబ్బతింటుంది. కొత్త సంవత్సరం మన ఆర్థిక అలవాట్లను మార్చుకోవడానికి.. ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పొదుపు పెంచడానికి ఒక గొప్ప అవకాశం. 2026లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
స్పష్టమైన ప్లాన్ ఉండాలి..
ఒక స్పష్టమైన ప్లాన్ లేకుండా ఏడాదిని ప్రారంభించడం అత్యంత సాధారణ పొరపాట్లలో ఒకటి. కేవలం అంచనాలతో ముందుకు వెళ్లడం వల్ల మొదటి కొన్ని నెలల్లోనే ఖర్చులు అదుపు తప్పుతాయి. రాతపూర్వక ప్లాన్ ఉండటం వల్ల అత్యవసర ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు అవసరాల మధ్య ప్రాధాన్యాలను గుర్తించవచ్చు. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఖర్చులను నియంత్రించి ఆనందాన్ని దూరం చేసుకోవడం కాదు. మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం.. ప్రారంభం నుంచి సరైన నిర్ణయాలు తీసుకోవడం అని అర్థం చేసుకోవాలి.
పొదుపును నిర్లక్ష్యం చేయొద్దు
జీవనశైలిని మెరుగుపరచుకోవాలనే ఆత్రుతలో పొదుపును నిర్లక్ష్యం చేయడం మరో ప్రధాన సమస్య. కొత్త వస్తువులు కొనడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా కాలక్రమేణా పొదుపును తగ్గిస్తాయి. ఆనందంగా ఉండటం, డబ్బు ఆదా చేయడం.. రెండూ ముఖ్యమే! సౌకర్యం కోసం చేసే ఖర్చు జాగ్రత్తను మించినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. బ్యాలెన్స్ లేకపోతే ఆదాయం పెరిగినా, ఆర్థిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది.
పెట్టుబడుల్లో ఆలస్యం వద్దు
పెట్టుబడులను, ట్యాక్స్ ప్లాన్‌ను వాయిదా వేయడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏడాది ఆరంభం నుంచే క్రమబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మెరుగైన నియంత్రణ లభిస్తుంది. చివరి నిమిషంలో పడే ఇబ్బందుల కన్నా ఏడాది పొడవునా చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.
తాహతుకు మించితే నో చెప్పాల్సిందే
అప్పులు ఇవ్వడం, ఖరీదైన పార్టీలు చేసుకోవడం వంటివి జేబును ఖాళీ చేస్తాయి. స్థాయికి మించిన బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. ఆదాయం తక్కువగా ఉండటం కంటే, అధిక బాధ్యతలే ఆర్థిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతాయి. అవసరమైనప్పుడు ‘వద్దు’ అని చెప్పాల్సిందే.
అత్యవసర నిధి, బీమా కంపల్సరీ
చాలామంది ఆకస్మిక ఇబ్బందులను ఊహించరు. అత్యవసర నిధి, బీమా లేకపోవడం వల్ల ఆకస్మిక ఖర్చులు తలెత్తినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడతారు. అత్యవసర పరిస్థితుల కోసం కొంత నిధిని పక్కకు పెట్టడం వల్ల భరోసా లభిస్తుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక అలవాట్లను మార్చుకోవడానికి అవగాహన, క్రమశిక్షణ చాలా అవసరం. తెలివిగా చేసే ఖర్చులు, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. మెరుగైన ప్లాన్‌తో ఏడాదిని ప్రారంభిస్తే కొత్త సంవత్సర తీర్మానాలు శాశ్వత అలవాట్లుగా మారతాయి.
