చెరువు ఒడ్డున గుట్టలుగా చికెన్ వ్యర్థాలు

చెరువు ఒడ్డున గుట్టలుగా చికెన్ వ్యర్థాలు
  • ప్రగతినగర్​లో 104 లారీల చెత్త తొలగింపు
  • మరో వంద లారీలు ఉంటుందని హైడ్రా అంచనా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రగతినగర్ (అంబీర్) చెరువు చికెన్, మాంసం, చేపల వ్యర్థాలతో దుర్గంధభరితమై స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో సహజత్వాన్ని కోల్పోయిన చెరువుకు పునరుజ్జీవం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​కు ఫర్ ఎ బెటర్ సొసైటీ ప్రతినిధులతో కలిసి స్థానికులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన అధికారులు.. చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చికెన్ వ్యర్థాలు వేయడానికి వచ్చిన 4 వాహనాలను హైడ్రా శనివారం పట్టుకుంది. 5-6 లారీలు, 3 జేసీబీలతో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ఆపరేషన్ అంబీర్ చెరువు మాదిరిగా పనులు చేస్తూ శనివారం వరకు 104 లారీల చెత్త తరలించారు.

 చెరువు ఒడ్డున గుట్టలుగా చెత్త పేరుకుపోయిందని, మరో వంద లారీలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కూకట్‌పల్లి -ప్రగతినగర్​ను కలుపుతూ చెరువు మధ్యలో వేసిన రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా చెత్త తొలగించాల్సి ఉందన్నారు. చిరు వ్యాపారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలంలో అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నారు. చెత్త పూర్తిగా తొలగించి ఫెన్సింగ్ వేయాలని హైడ్రా నిర్ణయించింది.