గాంధీని విస్మరించి.. గాడ్సేను ఆరాధిస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్

గాంధీని విస్మరించి.. గాడ్సేను ఆరాధిస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్
  • రాజకీయ కక్షతోనే పథకాల పేర్లు చేంజ్: మంత్రి పొన్నం ప్రభాకర్​
  • నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కరీంనగర్/ హుస్నాబాద్​, వెలుగు: దేశ స్వాతంత్ర్యం  కోసం మహాత్మా గాంధీ పోరాడితే.. ఆయనను చంపిన గాడ్సేను బీజేపీ వాళ్లు ఆరాధిస్తున్నారని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే పథకాల పేర్లు మార్చేస్తున్నారని ఫైరయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల గెలిచిన సర్పంచ్ లను శనివారంకరీంనగర్ ఇందిరా గార్డెన్స్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​తో కలిసి ఆయన సన్మానించారు.

అలాగే హుస్నాబాద్​లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. స్థానికంగా ఉపాధి కల్పించి, వలసలను నివారించాలనే గొప్ప సంకల్పంతో సోనియా గాంధీ నాయకత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. పథకం పేరును ‘వి.బి. రామ్ జీ’గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. గాంధీ, నెహ్రూల వారసత్వాన్ని తుడిచిపెట్టే కుట్రలో భాగమేనని ఆరోపించారు.

గాడ్సే వారసులుగా ఉన్న బీజేపీకి గాంధీ అంటేనే భయమని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆదివారంరాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గాంధీ ఫొటోలతో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పొన్నం పిలుపునిచ్చారు. కొత్త సర్పంచ్​లు గ్రామాల్లో మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, లైబ్రరీ చైర్మన్లు సత్తు మల్లేశ్, లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్​చార్జి వొడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్​ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, సంగీతం శ్రీనాథ్  పాల్గొన్నారు.