ఈ ఏడాది పెరిగిన కేసులు 44.. వరంగల్‍ కమిషనరేట్లో 2014 లో 14,412.., ఈసారి 14,456 క్రైమ్‍ కేసులు

ఈ ఏడాది పెరిగిన కేసులు 44..  వరంగల్‍ కమిషనరేట్లో 2014 లో 14,412.., ఈసారి 14,456 క్రైమ్‍ కేసులు
  • రోడ్డు ప్రమాద చావులు 467, గాయపడ్డోళ్లు 1,526 మంది
  • 132 రేప్‍ కేసుల్లో.. 101 మంది దగ్గరోళ్లే అగాయిత్యం చేసిన్రు  
  • హెల్మెట్‍ లేనివి 9 లక్షలు.. డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ 35,513 కేసులు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్‍ రేట్‍ పెరిగింది. 2024 ఏడాది కంటే మైనర్లపై వేధింపులతో పాటు పోక్సో కేసులు ఎక్కువ నమోదయ్యాయి. చోరీలు పెరిగాయి. వ్యక్తిగత దాడులు, శారీరక హింస కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. యాక్సిడెంట్లు పెరుగగా, వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. దానికి మూడురెట్లు గాయాలపాలయ్యారు. ట్రాఫిక్‍ పోలీసులు రికార్డు స్థాయిలో జరిమానాలు విధించారు. మొత్తంగా కమిషనరేట్‍ పరిధిలో 2024 ఏడాదిలో 14,412 క్రైమ్‍ కేసులు నమోదవగా, ఈసారి 14,456 కేసులు పెరిగాయి.

మహిళలు, మైనర్లపై పెరిగిన దాడులు..

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో మహిళలు, మైనర్‍ బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయి. మహిళా హత్యలు, ఆత్మహత్యలు, గృహహింస వంటి కేసులు 834 నుంచి 758 కి తగ్గినప్పటికి, మహిళలు, మైనర్లపై దాడులే భయందోళనకు గురిచేశాయి. గతేడాది మహిళలు, మైనర్ల కిడ్నాపులు, వేధింపులు, పోక్సో వంటి మొత్తంగా 670 కేసులు నమోదైతే, ఈసారి 102 మహిళలు, మైనర్ల కిడ్నాపులు, 405 వేధింపులు, 188 పోక్సో కేసులతో కలిపి 695 కేసులకు పెరిగింది.

ప్రమాదాల్లో 467 మంది మృతి..

కమిషనరేట్‍ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడ్తున్నాయి. రెగ్యూలర్ రోడ్లపై 430 మంది, ఓఆర్‍ఆర్‍పై 37 మందితో కలిపి మొత్తంగా ఈ ఏడాది 467 మంది ప్రయాణికులు రోడ్డు యాక్సిడెంట్లలో కన్నుమూశారు. మరో 1,526 మంది కాళ్లుచేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వీటికి సంబంధించి 15,00 కేసులు నమోదయ్యాయి. 

దగ్గర అనుకున్నోళ్లే రేప్‍ చేస్తున్రు..

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో 2025 ఏడాదిలో 132 రేప్‍ కేసులు నమోదయ్యాయి. ఇందులో 80 శాతం కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారుల దగ్గరి మనుషులే ఉన్నారు. మొత్తం 132 కేసుల్లో 73 కేసులు ఫ్రెండ్‍ ముసుగులో, 8 కుటుంబ సభ్యులు, 20 మంది ఇరుగుపొరుగువాళ్లు ఉండగా, 27 మంది ఇతరులు ఉన్నారు. మరో 4 తప్పుడు రేపు కేసులు నమోదయ్యాయి. 

సిబ్బంది పనితీరువల్లే నియంత్రణలో నేరాలు..

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంవల్లే నేరాల తీవ్రత నియంత్రణలో ఉందని వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపారు. శనివారం హనుమకొండ భీమారంలో 'పోలీస్‍ కమిషనరేట్‍ 2025 వార్షిక నివేదిక' సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలీస్తే 0.53 శాతం స్వల్పంగా క్రైమ్‍ రేట్‍ పెరిగినట్లు చెప్పారు. కమిషనరేట్‍ పరిధిలో మొత్తం 14,456 కేసులు నమోదవగా 6,040 కేసులు పరిష్కారం అయ్యాయని, ఇందులో 2,573 మందికి శిక్షలు పడ్డట్లు వెల్లడించారు. ప్రధాన కేసుల నియంత్రణలో టాస్క్​ ఫోర్స్​ పోలీసుల తీరు అభినందనీయమన్నారు. ఈ విభాగం 418 కేసుల్లో 978 మందిని అరెస్ట్​ చేయడంతో పాటు దాదాపు రూ.14 కోట్ల 80 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్‍, దార కవిత, ఏఎస్పీ చేతన్‍, అడిషనల్‍ డీసీపీ రవి, ప్రభాకర్‍, శ్రీనివాస్‍ పాల్గొన్నారు. 

ట్రాఫిక్‍ చలాన్లలో రికార్డు..

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్‍ డ్రైవ్‍ ఏర్పాటు చేసి ట్రాఫిక్‍ పోలీసులు కమిషనరేట్‍ పరిధిలో రికార్డు స్థాయిలో జరిమానాలు విధించారు. డ్రైవింగ్​ లైసెన్స్, ​హెల్మెట్‍ లేకపోవడం, రాంగ్‍ రూట్‍, సెల్​ఫోన్, డ్రంక్ అండ్‍ డ్రైవింగ్‍, ట్రిపుల్‍ రైడింగ్‍, సిగ్నల్‍ జంప్‍, నంబర్‍ ప్లేట్‍ సరిగాలేని వాహనాలు నడపడం వంటి కేసుల్లో 11 లక్షల 20 వేల కేసులు నమోదు చేశారు. రూ.10 లక్షల 56 వేలకు పైగా చలాన్లు విధించారు. 2024లో 6,79,606 ఉండగా, ఈసారి అమాంతం 35.69 శాతం ఎక్కువ చలాన్లు విధించారు. కేవలం 35,513 డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కోర్టు కేసుల ద్వారానే రూ.2 కోట్ల 19 లక్షలు జరిమానాలు వసూలు చేశారు.

ఏడాది కాలంలో పెరిగిన వివిధ కేసుల సంఖ్య 

నేరం తీరు    2024    2025 

మైనర్లపై వేధింపులు,    364    405

పోక్సో శారీరక హింస,    12,090    12,099

దాడులు వాహన చోరీలు    203    245

ఔటర్‍ రింగురోడ్‍ డెత్‍    21    37

గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య

తగ్గిన నేరాలు    2024    2025 

గృహ హింస    624    576

కట్నపు చావులు    10    04

రేప్​లు    145    132

దోపిడీలు    23    16

కిడ్నాపులు    183    148