- ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని
- దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరు: సీఎం రేవంత్
- ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాటం సాగిద్దాం
- తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే నడుస్తారని ధీమా
- సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును ‘వీబీజీ రామ్ జీ’ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం పడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పథకానికి తెలుగు ప్రజలకు, తెలంగాణకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు.
పేరు మార్చి తెచ్చిన కొత్త చట్టం కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామీణ మహిళలు, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు జరిగే నష్టాలను అర్థంచేయించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్ముడి పేరును తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్’పై పోరాటం మాదిరిగానే.. ఉపాధి హామీ చట్టం రద్దుపై ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాటం సాగిద్దామన్నారు.
ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంట నడుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగం మార్పు దిశలో బీజేపీ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.
దేశవ్యాప్త క్యాంపెయిన్, ప్రచారాలతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. ‘సర్’పై పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభించిందన్నారు. ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదం గ్రామీణస్థాయి వరకు వెళ్లిందని చెప్పారు. ఈసీతో కలిసి మోదీ సర్కారు చేస్తున్న కుట్రలు అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. దీంతో దళితులు, గిరిజనులు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గరయ్యారని చెప్పారు.
అగ్రనేతల అభినందనలు..
పార్టీ ఆఫీసు ఆవరణలో సీడబ్ల్యూసీ మీటింగ్‌కు ముందు, తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి కాసేపు ముచ్చటించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో విజయం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సక్సెస్, తాజాగా తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపుపై అగ్రనేతలు సంతోషం వ్యక్తం చేశారు.
65–70 శాతం మేరకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందడంపై సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని అభినందించినట్టు తెలిసింది. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీని ముందుండి నడిపించాలని సూచించారు. కాగా.. తెలంగాణలోని పలు పార్టీ పదవులకు సంబంధించి కూడా నేతలతో సీఎం చర్చించినట్లు తెలిసింది.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు అధిష్టానానికి సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ అవినీతి పాలనలో రాష్ట్రానికి జరిగిన జలనష్టం, ప్రాజెక్ట్ రూపంలో అవినీతి, ఇతర అంశాలను కీలకంగా సభ ముందుకు తేనున్నట్టు చెప్పారు.
అయితే, ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు శనివారం సాయంత్రమే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.
