- రూ.531.10 కోట్లతో అటవీశాఖ మెగా ప్రాజెక్టు
- వేటగాళ్లు, ఫారెస్ట్ ఆక్రమణదారుల ఆటకట్టించేలా ప్లాన్
- అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ కార్యాచరణ
- జైకా ద్వారా వచ్చే ఏడేండ్లలో రూ.440 కోట్ల నిధులు సేకరణ
హైదరాబాద్, వెలుగు: అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లకు, అటవీ భూమిని కబ్జా చేస్తున్న ఆక్రమణదారులకు చెక్ పెట్టేందుకు అటవీశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇన్నాళ్లూ సిబ్బంది, ఆఫీసర్ల కొరతతో సతమతమైన అటవీశాఖ.. ఇకపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నది. అడవుల్లో హైటెక్ నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది.
ఈ మేరకు అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు జీఐఎస్, ఏఐ, డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్‌తో కాపలా వ్యవస్థను రెడీ చేస్తున్నది. రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో పచ్చదనం ఫరిడవిల్లేలా చేయాలని ప్రణాళిక రూపొందించింది.
ఇందులో భాగంగా అడవులతోపాటు వ్యవసాయ భూములు, ఖాళీ జాగాల్లోనూ మొక్కలు పెంచేలా కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అటవీశాఖ రూ. 531.10 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అటవీశాఖలో ‘కెపాసిటీ ఎన్‌హాన్స్‌మెంట్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్’ పేరుతో ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నారు.
జైకా సహకారంతో..
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా ) సహకారంతో రాబోయే ఏడేండ్లలో అటవీ రక్షణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ ప్రాజెక్టులో మొత్తం రూ. 531.10 కోట్లు నిధులు కేటాయించనుండగా.. వచ్చే ఏడేండ్లలో విడతలవారీగా రూ. 440 కోట్లు జైకా సమకూర్చనున్నది. మిగిలిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
ఈ నిధులతో అటవీశాఖలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడం, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, ఫారెస్ట్ సిబ్బంది, ఆఫీసర్లకు శిక్షణ, అడవిలో వేటగాళ్లపై నిఘా, ఫారెస్ట్భూములు కబ్జా గురికాకుండా అటవీ సరిహద్దులను నిర్ణయించడంతోపాటు వాటి రక్షణకు ట్రెంచ్‌లు ఏర్పాటు, టైగర్ రిజర్వ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు తదితర పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
శాటిలైట్ మ్యాపింగ్, జీఐఎస్
అటవీ సరిహద్దులను జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా డిజిటలైజ్ చేస్తారు. శాటిలైట్ ఇమేజరీ ద్వారా అడవి విస్తీర్ణం తగ్గుతున్నా, కొత్తగా ఆక్రమణలు జరుగుతున్నా వెంటనే హెచ్చరికలు జారీ అవుతాయి. అడవిలో జరిగే ప్రతి కదలికను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.
అడవుల్లో స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి, కార్చిచ్చులను గుర్తించడానికి డ్రోన్లు, జీఐఎస్, శాటిలైట్ మ్యాపింగ్‌లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగపడనున్నది. అయితే, ఇన్నాళ్లూ దట్టమైన అడవుల్లోకి సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ టెక్నాలజీతో సమస్య తీరనున్నది. అలాగే, అత్యంత విలువైన టేకు, ఎర్రచందనంలాంటి వృక్ష సంపద స్మగ్లర్ల పాలవుతున్నది. ఇకనుంచి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంటుంది.
ఈ హైటెక్ నిఘాతో స్మగ్లర్లు అడవిలో అడుగుపెట్టడం కష్టంగా మారనుంది. రాత్రి వేళల్లో కూడా పనిచేసే నైట్ విజన్ కెమెరాలు, సెన్సార్ల ద్వారా స్మగ్లింగ్ ముఠాల కదలికలను పసిగట్టవచ్చు. అలాగే వేసవిలో అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా (ఫారెస్ట్ ఫైర్స్) ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనున్నది.
క్షేత్రస్థాయిలో సిబ్బందికి ట్యాబ్స్..
అడవిలో ఏం జరుగుతుందనేదానిపై పైనుంచి నిఘా పెట్టడమే కాదు.. క్షేత్రస్థాయిలో పనిచేసే బీట్ ఆఫీసర్ల చేతికి కూడా టెక్నాలజీని అందించనున్నారు. వారికి జీపీఎస్ అనుసంధానంతో కూడిన పీడీఏ (పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్)లు లేదా ట్యాబ్స్ ఇవ్వనున్నారు.
అటవీ సరిహద్దుల్లోని పిల్లర్ల ఫొటోలు, చెట్ల గణన, ఆక్రమణల వివరాలను వారు ఎప్పటికప్పుడు ట్యాబ్‌ల ద్వారా ఆన్లైన్లో అప్‌లోడ్ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. జైకా నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే.. మన అడవులకు మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఫారెస్ట్ అకాడమీలో సిబ్బందికి ట్రైనింగ్..
అటవీ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బందికి దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో టెక్నాలజీపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అడవిలో ఆక్రమణలను అరికట్టడం.. వన్యప్రాణులపై జరిగే దాడులు..నేరాలపై విచారణ చేయడం.. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 24 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నా.. రక్షణ వ్యవస్థలో లోపాలున్నాయి.
సరైన వెహికల్స్ లేకపోవడం, సిబ్బందికి మోడ్రన్ ట్రైనింగ్ లేకపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. ఈ శిక్షణ ద్వారా అడవిలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాతుల రక్షణకు తోడ్పాటు అందనున్నది. స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పెట్టడంతోపాటు ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
