ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
  • కృష్ణా, గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి పొంగులేటి 
  • రెండేండ్లు ఫామ్​హౌస్​లో నిద్రపోయి ఇప్పుడు లేనిపోని విమర్శలా? 
  • ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడాలని కేసీఆర్​కు సవాల్​

మహబూబాబాద్, వెలుగు: రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్‌లో మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహబూబాబాద్​లో ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో మానుకోట జిల్లాలో 75 శాతం సర్పంచ్​ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్​ రెబల్స్ కారణంగా కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ గెలిచిందే తప్ప వాళ్ల సొంత బలంతో కాదన్నారు.

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాలోంచి చుక్క నీటిని కూడా వదులుకోబోమన్నారు. రెండేండ్లు ఫామ్‌హౌస్‌లో నిద్రపోయిన కేసీఆర్‌.. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారన్నారు. 29 నుంచి అసెంబ్లీ ఉందని, కేసీఆర్‌ వచ్చి సభలో మాట్లాడాలని సూచించారు.  అనంతరం సర్పంచ్‌లను మంత్రి సత్కరించారు. 

కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు భరత్‌ చందర్‌రెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్, ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ నెహ్రూనాయక్‌పాల్గొన్నారు.

రాజకీయ విలువలు కలిగిన నేత నూకల 

మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రామచంద్రారెడ్డి విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశారని, వందేమాతరం పోరాటంలో పాల్గొని అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు.