రెండు సెకండ్లలోనే 700కి.మీ స్పీడ్..హైస్పీడ్‌‌ రైళ్లలో చైనా మరో రికార్డు

రెండు సెకండ్లలోనే 700కి.మీ స్పీడ్..హైస్పీడ్‌‌ రైళ్లలో చైనా మరో రికార్డు

హైస్పీడ్‌‌ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ రెండు సెకండ్లలోనే 700 కి.మీ వేగాన్ని అందుకునే మాగ్లెవ్  రైలును విజయవంతంగా పరీక్షించింది. మాగ్నెటిక్‌‌  లెవిటేషన్‌‌  టెక్నాలజీతో ఈ మాగ్లెవ్‌‌  మోడల్‌‌ ట్రైన్​ను రూపొందించింది.

మాగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించిన చైనా

బీజింగ్: హైస్పీడ్‌‌ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.  జస్ట్ రెండు సెకండ్లలోనే 700 కి.మీ వేగాన్ని అందుకునే మాగ్లెవ్  రైలును విజయవంతంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాగ్నెటిక్‌‌  లెవిటేషన్‌‌  టెక్నాలజీతో ఈ మాగ్లెవ్‌‌  మోడల్‌‌  ట్రైన్‌‌ ను రూపొందించినట్టు చైనా నేషనల్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ డిఫెన్స్ టెక్నాలజీ తెలిపింది. దీని బరువు దాదాపు టన్ను వరకు ఉంటుందని చెప్పింది.

 400 మీటర్ల (1,310-అడుగులు) మాగ్లెవ్ ట్రాక్‌‌ పై దీన్ని పరీక్షించినట్టు వర్సిటీ ప్రొఫెసర్  లి జీ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము రూపొందించిన అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్‌‌ సిస్టమ్ రైలుగా ఇది నిలిచిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై తమ బృందం పదేండ్లుగా పని చేస్తున్నదని  వివరించారు. 

ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ప్రయోగంలో ఇదే రైలు 648 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకున్నదని తెలిపారు.  దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇదే యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటిసారిగా మనుషులు ప్రయాణించే సింగిల్ బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసిందని చెప్పారు.