కాంగ్రెస్లో పదవుల పండుగ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం

కాంగ్రెస్లో పదవుల పండుగ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం
  • రేపటి వరకు లీడర్లకు అవకాశం
  • ఈ నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో పేర్ల ప్రకటన

మహబూబ్​నగర్, వెలుగు: కాంగ్రెస్​లో పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో ప్రతి పోస్టుకు క్రేజ్  ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లోనూ.. ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి గ్రామపంచాయతీల్లో పాగా వేశారు. దీంతో కేడర్  ఫుల్ జోష్​లో ఉంది. ఇదే సమయంలో డీసీసీలోని జిల్లా స్థాయి పదవులను కూడా భర్తీ చేసేందుకు హైకమాండ్​ రంగం సిద్ధం చేసింది. 

దరఖాస్తుల స్వీకరణ షురూ..

సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ హైకమాండ్​ జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించింది. ఇందులోభాగంగా మహబూబ్​నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వగా.. నారాయణపేట, నాగర్​కర్నూల్  జిల్లాల్లో పాత వారినే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో మిగతా బాడీని ఏర్పాటు చేయలేదు. తాజాగా మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించి ఆసక్తి ఉన్న లీడర్లు జిల్లా కాంగ్రెస్​ కమిటీలోని పదవులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశీలకుడు గంజి భాస్కర్​ కోరారు.

శనివారం నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. సోమవారం వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా అప్లికేషన్​ను రూపొందించారు. ఈ అప్లికేషన్  ఫామ్​లో ముందుగా ఏ పోస్టు కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు? అనే వివరాలతోపాటు లేటెస్ట్​ ఫొటోను జత చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న లీడర్  వ్యక్తిగత వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. చివరగా అతని రాజకీయ నేపథ్యం గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ, నామినేటెడ్​ పోస్టుల్లో గతంలో పని చేశారా? కాంగ్రెస్​పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనైనా కొనసాగుతున్నారా? మీరు గతంలో ఇతర ఏ పార్టీలోనైనా సభ్యులుగా ఉన్నారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్​గా దరఖాస్తుదారుడు కాంగ్రెస్​ కార్యకర్తగా తన కార్యకలాపాల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్​ను మహబూబ్​నగర్  డీసీసీ ఆఫీస్​లో సమర్పించాలి. వచ్చిన అప్లికేషన్స్​ను మంగళవారం టీపీసీసీకి పంపించనున్నారు. అనంతరం సామాజిక సమీకరణల ఆధారంగా టీపీసీసీ పోస్టులను కేటాయించనుంది. 

పదవుల కోసం పోటాపోటీ..

జిల్లా కాంగ్రెస్​ కమిటీలో పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. మండల స్థాయి లీడర్ నుంచి జిల్లా స్థాయి లీడర్​ వరకు అందరికీ కమిటీలో అవకాశం కల్పిస్తారనే సంకేతాలు రావడంతో ఆశావహులు పెరిగిపోయారు. దీంతో తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఫలానా పదవి తమకు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఇన్నాళ్లుగా పార్టీ కోసం పని చేశామని, ఒక్క చాన్స్​ ఇవ్వాలని వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే ట్రెజరర్​తోపాటు జిల్లాలోని ప్రతి బ్లాక్​కు ఒక జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వనున్నారు. 

ఒక బ్లాక్​కు రెండు జనరల్  సెక్రటరీ పోస్టులు  కేటాయించనున్నారు. ప్రతి మండలానికి ఒక కార్యదర్శి చొప్పున జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటే అంత మందికి ఈ పోస్టును ఇవ్వనున్నారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నారు. అలాగే మున్సిపల్  కార్పొరేషన్​లో జనాభా ఆధారంగా ప్రతి పది డివిజన్లకు ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు డివిజన్లకు ఒక కార్యదర్శి పదవులు ఉండనున్నాయి. 

ఎన్నికలకు ముందే ప్రకటన.. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో మున్సిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలకు ముందే జిల్లా కాంగ్రెస్​ కమిటీ పదవులను క్లియర్​ చేయడంతోపాటు పెండింగ్​లో ఉన్న నామినేటెడ్​ పదవులను భర్తీ చేయాలని హైకమాండ్  భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో జిల్లా కాంగ్రెస్​ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.