సింగరేణి కార్మికులపై రేవంత్ పగ : బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు

సింగరేణి కార్మికులపై రేవంత్ పగ :  బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు
  • కాళ్లు, చూపు లేనోళ్లు, బైపాస్​చేయించుకున్నోళ్లూ ఉద్యోగం చేయాలట: హరీశ్​రావు
  • వెంటనే మెడికల్​బోర్డు పెట్టిడిపెండెంట్​ఉద్యోగాలివ్వాలి..లేదంటే భట్టి ఇంటిని ముట్టడిస్తం
  • రిపోర్టర్లు, డెస్క్​జర్నలిస్టులందరికీఒకే రకమైన కార్డులివ్వాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులపై సీఎం రేవంత్​ రెడ్డి పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. కాళ్లు లేనివాళ్లను, కండ్లు కనిపించని వాళ్లను, గుండెకు బైపాస్​ సర్జరీ చేసినోళ్లనూ ఉద్యోగం చెయ్యాలంటూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, కార్మిక కంటక ప్రభుత్వమని మండిపడ్డారు. కార్మికులను గోస పెడుతున్నదన్నారు. నెలకు రెండుసార్లు మెడికల్​ బోర్డు, అలియాస్​ పేర్లను పరిశీలిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఈ రెండేండ్లలో కేవలం రెండుసార్లే మెడికల్​ బోర్డు పెట్టారని మండిపడ్డారు. వెంటనే మెడికల్​బోర్డును పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్​ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. 

శనివారం ఆయన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్​) నేతలతో కలిసి సింగరేణి భవన్​లో సంస్థ డైరెక్టర్​గౌతమ్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సింగరేణి భవన్​బయట మీడియాతో మాట్లాడారు. 40 వేల మంది సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్​ఉద్యోగులేనని చెప్పారు. 

సింగరేణిని ప్రైవేట్​పరం చేసేందుకు రేవంత్​కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. విద్యుదుత్పత్తికి బొగ్గును తీసుకుని బిల్లులు చెల్లించడం లేదని, దీంతో సంస్థ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రేవంత్​ సీఎం అయ్యాక సింగరేణి సంస్థ రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హరీశ్​ రావు ఆరోపించారు. ఆర్థికమంత్రిగా భట్టి విక్రమార్క సింగరేణి గొంతు కోస్తున్నారని, ఇది తగునా అని ప్రశ్నించారు. ‘‘నీ సోకుల కోసం, ఫుట్​బాల్​ కోసం సింగరేణి సంస్థకు చెందిన రూ.10 కోట్లను ఎట్లా ఖర్చు చేస్తవ్​రేవంత్​ రెడ్డి? బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఆ వాడిన సొమ్ముపై ఎంక్వైరీ చేయించి.. దానికి కారణమైనోళ్లను బొక్కలో వేయిస్తం. భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మెడికల్​బోర్డు పెట్టాలి. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేదంటే వారందరితో కలిసి భట్టి ఇంటిని ముట్టడిస్తం’’ అని హెచ్చరించారు. 

డెస్క్​ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి

జర్నలిస్టుల్లో రిపోర్టింగ్, డెస్క్​జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎలాంటి తేడాలు చూపించకుండా అందరికీ అక్రెడిటేషన్లు ఇచ్చామన్నారు. కేసీఆర్ 26 వేల అక్రెడిటేషన్లు ఇస్తే.. దానిని రేవంత్​ ప్రభుత్వం 10 వేలకు తగ్గించిందని మండిపడ్డారు. సోషల్​ మీడియా, యూట్యూబ్​ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని హామీ ఇచ్చి.. హక్కుల కోసం కొట్లాడుతున్న జర్నలిస్టులను అరెస్ట్​ చేస్తున్నారని విమర్శించారు. 

జర్నలిస్టుల పోరాటానికి బీఆర్​ఎస్​ పార్టీ తరఫున పూర్తి మద్దతిస్తామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. రేవంత్​ ప్రభుత్వంలో జర్నలిస్టులు సహా ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు.