బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు రండి : హైకోర్టు ఆదేశం

బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు రండి :  హైకోర్టు ఆదేశం
  • ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఫిష్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ పంపిణీ చేసిన వారికి బిల్లులు చెల్లించాలన్న తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియాను హైకోర్టు ఆదేశించింది. బిల్లులు చెల్లించాలని 10 నెలల క్రితం ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి మరో నాలుగు వారాలు సమయం ఇస్తున్నామని స్పష్టం చేసింది. 

ఈసారి తమ ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. 2023–-24 సంవత్సరానికి తాము అందజేసిన ఫిష్‌‌‌‌ సీడ్స్‌‌‌‌కు సంబంధించిన నగదు చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ శ్రీసాయి ఫిష్‌‌‌‌ సీడ్స్, ఇతరులు పిటిషన్లు వేశారు.

బకాయిలు చెల్లించాలని గత ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు జారీలు చేసినప్పటికీ అమలు చేయలేదంటూ వారందరూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌‌‌‌ టి. మాధవీదేవి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది మరో నాలుగు వారాలు వాయిదా కోరడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఈసారి బిల్లులు చెల్లించని పక్షంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.