- నలుగురు అరెస్ట్, మరొకరు పరారీ
కూకట్‌పల్లి, వెలుగు: ఎస్వోటీ పోలీసులుగా పరిచయం చేసుకుని ఓ యువకుడిని బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నావని బెదిరించి, రూ.3 కోట్లు డిమాండ్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఏపీలో రొయ్యల వ్యాపారం చేసే హరీశ్ కుమార్ రాజు ఫిబ్రవరి నుంచి మూసాపేట పరిధిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎల్బీనగర్కు చెందిన నరసింహరాజు(40), అతని స్నేహితులు రవీంద్రబాబు(36), ప్రశాంత్ (34), నరేశ్(37), రవికుమార్(36) అతని ఫ్లాట్‌కు వచ్చారు. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నావని తెలిసిందంటూ హరీశ్‌ను బెదిరించారు. రూ.3 కోట్లు ఇస్తే వదిలేస్తామని లేదంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. భయపడిన హరీశ్ డబ్బుల కోసం పలువురికి ఫోన్లు చేశాడు.
ఏపీలోని సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన సోదరుడు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు కూకట్‌పల్లి పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని హరీశ్‌ను తీసుకెళ్తున్న నిందితులను పట్టుకున్నారు. వీరిలో రవికుమార్ పరారవ్వగా మిగిలిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా హరీశ్ నిజంగానే బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తమ స్నేహితుడు బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడని, ఆ డబ్బును రికవరీ చేసేందుకే తాము నకిలీ పోలీస్ అవతారం ఎత్తామని నిందితులకు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి సీఐ సుబ్బారావు తెలిపారు.
