60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియామకం

60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీలో 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని సర్కిళ్లకు ఇదివరకే ఉన్నవారిని కొనసాగించగా, కొన్నింటికి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. వీరంతా శనివారమే ఆయా సర్కిళ్లలో బాధ్యతలు చేపట్టారు. పాత జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండగా, ఇప్పుడు 60 సర్కిళ్లు, 12 జోన్లుగా ఏర్పాటు చేశారు. విస్తీర్ణం 650 చదరపు కి.మీ. నుంచి 2,053 చదరపు కి.మీ.కు, జనాభా 1.34 కోట్లకు పైగా పెరగడంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్​గా జీహెచ్ఎంసీ అవతరించింది. ఇందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నారు. విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ వారంలో పూర్తిగా అన్ని విభాగాల అధికారులు,  సిబ్బందిని నియమించనున్నారు.

ఫీల్డ్​లోకి దిగిన జోనల్ కమిషనర్లు

జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఫీల్డ్​లోకి దిగారు. చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ దోమలగూడలో కొత్త సర్కిల్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పారిశుధ్య పనులను సమీక్షించారు.ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ఉప్పల్ కూడలి నుంచి వరంగల్ రహదారి మార్గంలో పారిశుధ్య పనులు పరిశీలించారు. గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి గోషామహల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శానిటేషన్ పనులు సమీక్షించారు. శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు పారిశుధ్య పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.