- జీవో 252ను వెంటనే సవరించాలని, డెస్కు జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్
ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: వర్కింగ్ జర్నలిస్టులను విభజించకుండా అర్హులైన అందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఏవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రాపర్తి దత్తాత్రి, కన్వీనర్ ఇందూర్ సాయిరాం మాట్లాడారు. వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దని, అక్రిడిటేషన్ల జారీలో వివక్ష చూపొద్దని కోరారు.
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు తీసేసి మీడియా కార్డులు ఇస్తామనడం సరికాదన్నారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే తీరును మానుకోవాలన్నారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇవ్వకపోవడమంటే కష్టపడి సాధించుకున్న హక్కును హరించడమేనని మండిపడ్డారు.
ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెడపట్ల సురేశ్, షేక్ మోయిజ్, ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కన్వీనర్ సుధాకర్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కోకన్వీనర్లు నిలేశ్, రాజన్న, సభ్యులు రాజు, ఆరిఫ్, సుజాత, స్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల హక్కులను హరించడమే..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జర్నలిస్ట్ అక్రిడిటేషన్ జీవో 252ను వ్యతిరేకిస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు.
నూతన జీవోలోని నిబంధనల వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్‌కు దూరమవుతున్నారని, ఇది జర్నలిస్టుల హక్కులను హరించడమేనని మండిపడ్డారు. 252జీవోను రద్దు చేయకుంటే అందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్డుల్లో కోత విధించడం సరికాదు
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ తెచ్చిన జీవో నెం.252ను వెంటనే సవరించాలని జర్నలిస్ట్ యూనియన్(టీయూడబ్ల్యూజేహెచ్143) ఆసిఫాబాద్‌జిల్లా కన్వీనర్ రవి నాయక్ డిమాండ్ చేశారు.
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జీవోను సవరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల హక్కుగా అందించాల్సిన అక్రిడిటేషన్ కార్డుల్లో కోత విధించడం సరికాదన్నారు.
గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గస్థాయి, మండల స్థాయి అక్రిడేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు సురేశ్, రామస్వామి, కిరణ్, రాజ్ కుమార్, గిరిశ్, సతీశ్, ఇర్ఫాన్, వెంకటేశ్, రాందాస్, కలీల్ పాల్గొన్నారు.
