- గత సర్కారు తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్కమీషన్ల కోసం హరీశ్‌రావు కక్కుర్తి పడ్డారని ఆరోపణ
- పాలమూరు ప్రాజెక్టును ఇన్‌టైమ్‌లో పూర్తిచేసుంటే 90 టీఎంసీల కృష్ణా నీళ్లను వాడుకునేవాళ్లం
- కృష్ణాపై మన ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టకనే ఏపీ దోపీడీ
- నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్.. ఏం చేశారని ఆగ్రహం
- 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్, వెలుగు: గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చూపించిన ప్రేమను పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు మీద చూపించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ‘‘గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్‌ను పరుగులు పెట్టించి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది. హరీశ్‌రావు కమీషన్లకు కక్కుర్తి పడి పాలమూరు – రంగారెడ్డిలోని నార్లాపూర్ ఓపెన్ పంప్‌హౌస్‌ను అండర్ గ్రౌండ్‌కు మార్పించారు.
టన్నెల్ నిర్మాణంలో బ్లాస్టింగ్‌తో కల్వకుర్తి లిఫ్ట్‌లోని ఎల్లూరు పంప్‌హౌస్ మునిగింది” అని ఆమె తెలిపారు. జా గృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా వట్టెం పంప్ హౌస్‌ను పరిశీలించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇన్‌టైమ్‌లో కంప్లీట్ అయితే 90 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకునే అవకాశం ఉండేదన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కట్టకపోవడం వల్లే వరద, మిగులు జలాల పేరుతో ఏపీ అక్రమంగా వాడుకుంటున్నదని తెలిపారు. ‘‘నిన్న మొన్నటి వరకు బనకచర్ల పేరు చెప్పిన ఏపీ.. ఇప్పుడు కొత్తగా నల్లమల సాగర్‌తో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నది.
పాలమూరు – -రంగారెడ్డికి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడమంటే తెలంగాణ జీవనధారను కోల్పోవడమే. కేసీఆర్ ప్రారంభించిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు. 21 ప్యాకేజీలు ఉన్న పాలమూరును 18 ప్యాకేజీలకు కుదించారు. కొన్ని నిధులు విడుదల చేస్తే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేది. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏం చేశారు?” అని ఆమె ప్రశ్నించారు.
హరీశ్ నిర్వాకంతో మునిగిన ఎల్లూరు పంప్‌హౌస్
కృష్ణాలో తెలంగాణకు 550 టీఎంసీలు రావాలని, కానీ 299 టీఎంసీలు చాలని గత ప్రభుత్వంలో లెటర్ ఇచ్చారని కవిత తెలిపారు. ఇప్పుడు ఆ నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం వల్లే నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు నిర్వాకంతో మునిగిన ఎల్లూరు పంప్‌హౌస్‌లో మూడే మోటార్లు పనిచేస్తున్నాయి. దీనికి మిషన్ భగీరథ స్కీమ్ కనెక్ట్ కావడంతో మోటర్లను బాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది” అని తెలిపారు.
సామాజిక తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఆయుధాన్ని..!
సామాజిక తెలంగాణ సాధన కోసమే జాగృతి పనిచేస్తున్నదని.. 80 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇస్తామని కవిత స్పష్టం చేశారు. జనం బాటలో తెలుసుకున్న సమస్యలపై కమిటీలు వేసి పోరాటం చేస్తామన్నారు. రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతులు, ట్రిపుల్ ఆర్ బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ‘‘నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.
సామాజిక తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఆయుధాన్ని. బీఆర్ఎస్ బాగుండాలని కోరుకున్న నన్ను రోడ్డు పడేశారు. కనీసం సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు’’ అని కవిత అన్నారు. రాజకీయ పార్టీ స్థాపించేందుకు అవగాహన కోసమే తెలంగాణ జాగృతి బాట పట్టామని, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించారు.
తనను ఓడించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని, కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తే ఓడిపోయేంతగా పరిస్థితులు దిగజార్చాయని మండిపడ్డారు. కాగా, దివంగత కవి కపిలవాయి లింగమూర్తి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడారు. జిల్లా జనరల్ హాస్పిటల్లో ప్రసూతి, పిల్లల వార్డును పరిశీలించారు. వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం నార్లాపూర్ పంప్‌హౌస్, ఎల్లూరు పంప్‌హౌస్‌ను ఆమె పరిశీలించారు.
