ఇదో కొత్త రకం ఫ్లేవర్ సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఓ స్టార్టప్ ప్రయత్నం
ఐస్‌క్రీమ్‌లో స్ట్రాబెర్రీ, వెనీలా, బట్టర్డ్, చాక్లెట్ లాంటి ఫ్లేవర్లు ఫేమస్. కానీ సౌతాఫ్రికాలోని కెప్‌టౌన్‌కి వెళితే ఇంకో కొత్త ఫ్లేవర్‌ను రుచి చూసేయొచ్చు. ఏంటా ఫ్లేవర్ అంటారా? ‘పురుగుల ఐస్‌క్రీం’. అవును, గౌర్మెట్ క్రబ్ అనే స్టార్టప్ ఈ ఐస్‌క్రీంలను తయారు చేస్తోంది. బ్లాక్ సోల్జర్ ఫ్లై పురుగుల లార్వాల నుంచి తీసిన ‘ఎంటో మిల్క్’తో వాటిని చేస్తోంది. ఇందులోనూ చాక్లెట్, పీనట్ బట్టర్, క్రిస్మస్ స్పీసిస్ లాంటి ఫ్లేవర్లున్నాయండోయ్. ఫ్లేవర్ మాత్రమే కాదని, ఈ పురుగుల ఐస్‌క్రీమ్‌లో మంచి పోషకాలు కూడా ఉంటాయని కంపెనీ కో ఫౌండర్ బెస్సా చెప్పారు. సాధారణ డెయిరీ పదార్థాల్లో కన్నా ఎంటో మిల్క్‌లో ఐదు రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయన్నారు. బీఫ్ కన్నా ఎక్కువ జింక్, ఐరన్, కాల్షియం ఇందులో ఉంటాయని చెప్పారు. లాక్టోస్, గ్లుటెన్, డెయిరీ పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, చక్కెరలు కూడా ఈ ఐస్‌క్రీమ్‌లో ఉండవని వివరించారు. ఎంటో మిల్క్ ఉత్పత్తికి ఎక్కువ నీరు, కరెంట్ కూడా అవసరం లేదని బెస్సా చెప్పారు. సాధారణ పశువుల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ గ్యాస్‌ల కన్నా పురుగులు తక్కువే ఉత్పత్తి చేస్తాయన్నారు. బయట వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పురుగులకు పట్టింపులేదన్నారు. ఈ పురుగులు బీరు ఉత్పత్తిలో చివరకు మిగిలే పిప్పిని తిని కూడా పెరుగుతాయని చెప్పారు.
2023 నాటికి 8 వేల కోట్ల వ్యాపారం!
గౌర్మెట్ గ్రబ్ 2017లో స్టార్టయింది. పురుగులను చూస్తున్న విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఫుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నామని బెస్సా చెప్పారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే గౌర్మెట్ గ్రబ్ ఐస్‌క్రీమ్‌ను అమ్ముతున్నారు. గత నెలలో గౌర్మెట్ కొత్త స్టోర్‌ను కూడా మొదలుపెట్టింది. అందులో రకరకాల పురుగుల వంటకాలను అమ్ముతున్నారు. పురుగుల మార్కెట్ 2023 నాటికి రూ.8 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
