- ఫుకెట్‌లో అదుపులోకి తీసుకున్న థాయ్ అధికారులు
న్యూఢిల్లీ: గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రధాన నిందితులు, క్లబ్ ఓనర్లు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని సంకెళ్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ నెల 6న రాత్రి 11.45 గంటల సమయంలో బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. దీంతో నిందితులిద్దరూ 7న ఉదయం 5.30 గంటలకు ఓ విమానంలో థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పారిపోయినట్లు ముంబైలోని ‘బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్’ గుర్తించింది. ఇండియన్ ఆఫీసర్లు, గోవా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు, ఇంటర్ పోల్ వారిపై ‘బ్లూ కార్నర్ నోటీసు’ జారీ చేసింది. దీని ఆధారంగా థాయ్‌లాండ్ పోలీసులు వారిని ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఇండియాకు తీసుకురావడానికి చట్టపరమైన ప్రక్రియ జరుగుతున్నది. కాగా, ఇన్వెస్టిగేషన్లో సౌరభ్, గౌరవ్ లూథ్రాకు సంబంధించిన అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నది. మొత్తం 42 కంపెనీలతో వీరికి సంబంధం ఉన్నట్లు కార్పొరేట్ రికార్డుల ద్వారా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ 42 కంపెనీలలో చాలా వరకు ఢిల్లీలోని ఒకే ఒక్క అడ్రస్ (2590, గ్రౌండ్ ఫ్లోర్, హడ్సన్ లైన్, కింగ్స్‌వే క్యాంప్, నార్త్-వెస్ట్ ఢిల్లీ) పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి.

