సర్కార్ నిర్ణయం : సాయంత్రం పెయిడ్ ఓపీ

సర్కార్ నిర్ణయం : సాయంత్రం పెయిడ్ ఓపీ

రాష్ట్రంలో ఔట్ పేషెంట్స్ (ఓపీ) టైమింగ్స్ పై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. డాక్టర్లను షిఫ్ట్‌‌ల వారీగా విభజించి పని చేయించుకోవాలని భావిస్తోంది. పెంచిన ఓపీ టైమింగ్స్‌‌, షిప్ట్‌‌ల ప్రతిపాదనకు డాక్టర్లు ఒప్పుకుంటే.. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రత్యేకంగా ఓపీ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సమయంలో ఓపీకి వచ్చే రోగుల వద్ద కొంత కన్సల్టెన్సీ ఫీజు వసూలు చేసి, ఆ మొత్తాన్ని డాక్టర్లకే అందించాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా డాక్టర్లకు అదనపు ఆదాయంతోపాటు, ప్రజలకు మేలు చేకూరుతుందని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈవినింగ్‌‌ ఓపీ సేవలను ముందుగా బోధనాస్పత్రుల్లో ప్రారంభించి, ఆ తర్వాత జిల్లా, ఏరియా ఆస్పత్రులకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

ఒత్తిడి పెరుగుతుందంటున్న డాక్టర్లు

ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. స్టాఫ్‌‌ కొరతతో ఇప్పటికే తమపై ఒత్తిడి పెరుగుతోందని, 12 గంటల వరకూ ఓపీ చూడటం, తర్వాత ఇన్‌‌పేషెంట్స్‌‌ను చూడటంతోనే సరిపోతుందని చెబుతున్నారు. ఖాళీలను భర్తీ చేయకుండా కేవలం టైమింగ్స్‌‌ పెంపు వల్ల ఉపయోగం ఉండదని, పైగా తమపై భారం పెరిగి వైద్య సేవల్లో నాణ్యత తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న 80 శాతం మంది డాక్టర్లు.. ప్రైవేటుగా క్లినిక్‌‌లు నడుపుతున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కన్సల్టెంట్‌‌ డాక్టర్లుగా పని చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కారణంతోనే ఓపీ టైమింగ్స్‌‌ పెంపును డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

నేడు డాక్టర్లతో ఈటల భేటీ!

ఓపీ టైమింగ్స్ వివాదం నేపథ్యంలో డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం భేటీ కానున్నారు. సమావేశంలో తమ డిమాండ్లను మంత్రికి వివరించేందుకు, డాక్టర్ల సంఘం సెంట్రల్‌‌ కమిటీ సభ్యులు శుక్రవారం సమావేశమయ్యారు. ఓపీ వేళల పెంపు, వైద్య విధాన పరిషత్‌‌ పరిధిలో పని చేసే డాక్టర్లకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించడం, నైట్‌‌ షిఫ్ట్‌‌ అలవెన్సులు, ప్రమోషన్లు వంటి పలు డిమాండ్లను లేవనెత్తాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అమలుకాని నయా టైమింగ్స్

మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో ఓపీ టైమింగ్స్ పెంపు అమలు కావడం లేదు. ఉత్తర్వులిచ్చి వారమైనా నయా టైమింగ్స్‌‌ ప్రారంభం కాలేదు. ఓపీ కౌంటర్లు త్వరగా బంద్‌‌ చేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.