సర్కార్ దవాఖాన్ల మెషిన్లకు రిపేర్ల రోగం

సర్కార్ దవాఖాన్ల మెషిన్లకు రిపేర్ల రోగం

ఏరియా హాస్పిటళ్ల నుంచి మెడికల్​ కాలేజీ ఆస్పత్రులదాకా..

ఎంఆర్‌‌ఐ, సీటీ స్కానింగ్‌ దాకా ఇదే తంతు

పరికరాల నిర్వహణను గాలికొదిలేసిన కాంట్రాక్టు కంపెనీ

వైద్య పరీక్షల కోసం ప్రైవేటు సెంటర్లకు పంపుతున్న డాక్టర్లు

డబ్బులు పెట్టే స్థోమత లేక చికిత్సకు దూరమవుతున్న పేదలు

హైదరాబాద్‌, వెలుగు నెట్​వర్క్​: సర్కారు దవాఖానల్లో డయాగ్నస్టిక్స్​ యంత్రాలకు రోగమొచ్చింది. మనుషులకు వచ్చిన రోగమేందో, దానికి కారణమేందో చెప్పే మెషిన్లు చిన్న చిన్న రిపేర్లతో మూలకుపడ్డయి. రోగమేందో తెలవాలంటె వైద్య పరీక్షలు తప్పదు. దీంతో సర్కారు డాక్టర్లు రోగులను ప్రైవేటు డయాగ్నస్టిక్స్​ సెంటర్లకు రిఫర్​ చేస్తున్నరు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటళ్ల నుంచి మెడికల్​ కాలేజీ హాస్పిటళ్ల దాకా పరిస్థితి ఇట్లనే ఉన్నది. బీపీ మెషన్ల నుంచి వెంటిలేటర్ల దాకా మెషిన్లన్ని మూలకుపడ్డయి. ఇప్పటికే వచ్చే రోగుల సంఖ్యకు సరిపడా మెషిన్లు లేక ఇబ్బంది పడుతుంటె.. ఉన్నవి కాస్త మొరాయిస్తున్నాయి. పేదలు డబ్బుల్లేక సర్కారు దవాఖానకు వస్తే.. రానుపోను చార్జీలకు, చేతి ఖర్చులకు తెచ్చుకున్న పైసలు కూడా ప్రైవేటు సెంటర్లలో వైద్య పరీక్షల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వందలు, వేలు పెట్టి రోగ నిర్ధారణ పరీక్షలు

చేయించుకోలేక చాలా మందికి తగిన వైద్యం అందడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. డయాగ్నస్టిక్స్​ మెషిన్లను రిపేర్‌‌‌‌ చేయించాలంటే సర్కారు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల ఉస్మానియా హాస్పిటల్​లో జూనియర్‌‌‌‌ డాక్టర్లు విధులు బహిష్కరించి, నిరసన తెలియజేశారు. రోగులకు సరిగ్గా ట్రీట్‌‌మెంట్ చేయలేకపోతున్నామని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వాయిదా పడుతున్న ఆపరేషన్లు

రోగ నిర్ధారణ యంత్రాలేకాకుండా ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన ఉపకరణాలు సైతం మొరాయిస్తున్నాయి. దీంతో చాలా హాస్పిటళ్లలో ఆపరేషన్లను సైతం వాయిదా వేయాల్సి వస్తోంది. సీఆర్మ్‌‌ యంత్రాలు పదే పదే పాడవుతుండడంతో ఉస్మానియాలో ఆర్థో ఆపరేషన్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. అలాగే ఎంఆర్‌‌‌‌ఐ, సీటీ స్కానింగ్‌‌ యంత్రాలు రిపేర్‌‌‌‌లో ఉండడంతో స్కానింగ్‌‌ కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఉస్మానియా హాస్పిటల్​లోని ప్రతి విభాగంలో నిరుపయోగంగా మారిన యంత్రాలు కనిపిస్తుండటం గమనార్హం. ఎంఆర్‌‌‌‌ఐ స్కాన్, సీటీ స్కాన్‌‌, వెంటిలేటర్లు, ఎండోస్కోపీ, ల్యాప్రోస్కోపీ వంటి కీలక యంత్రాలు సహా సుమారు 500 యంత్రాలు రిపేర్లకు వచ్చి మూలన పడినట్టు డాక్టర్లు, నర్సులు చెబుతున్నారు.

గాంధీలోనూ…

హైదరాబాద్​లోని మరో పెద్దాస్పత్రి గాంధీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ సుమారు 120 యంత్రాలు రిపేర్‌‌‌‌లో ఉన్నట్టు అంచనా. ఫేబర్‌‌‌‌ సింధూరి కంపెనీ నిర్లక్ష్యంతోనే యంత్రాలు మూలకు పడుతున్నాయని ఉస్మానియా సూపరింటెండెంట్‌‌, డాక్టర్‌‌‌‌ బి.నాగేందర్‌‌‌‌ ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

గాలికొదిలేసిన ఫేబర్‌‌‌‌ సింధూరి

సర్కారు హాస్పిటళ్లలో యంత్రాలు, పరికరాల నిర్వహణ బాధ్యతను 2017లో చెన్నైకి చెందిన ఫేబర్‌‌‌‌ సింధూరి అనే సంస్థకు కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 వేల వైద్య పరికరాలు, యంత్రాల నిర్వహణను ఆ కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా ఆ యంత్రాలు, పరికరాల ఖరీదులో 5.7 శాతం మొత్తాన్ని ఫీజుగా చెల్లిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా యంత్రం పాడైతే ఏడు రోజుల్లోగా రిపేర్‌‌‌‌ చేయాలి. కానీ సమాచారమిచ్చి నెలలు గడుస్తున్నా ఆ సంస్థ పట్టించుకోవడం లేదని డాక్టర్లు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో చిన్న చిన్న రిపేర్లు వచ్చిన యంత్రాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతోనే రిపేర్లు చేయడంలేదని ఫేబర్ సింధూరి ప్రతినిధులు అంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఈ కంపెనీకి ఇచ్చిన ఆరేండ్ల కాంట్రాక్టులో రెండేండ్లు పూర్తయింది. హాస్పిటళ్ల వద్ద నిధులున్నా యంత్రాలకు రిపేర్లు చేయించడానికి వీలులేదు. ఈ నిబంధనను సడలించాలని టీఎస్‌‌ఎంఐడీసీని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కోరుతున్నారు.

పరికరాలున్నా ఆపరేటర్లేరీ?

-హుజూరాబాద్‌‌లోని 100 పడకల దవాఖానాలో అవసరమైన వైద్య పరికరాలున్నా సిబ్బంది లేక నిరుపయోగంగా మారాయి.

-ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో డెంటల్‌‌, పీడియాట్రిక్స్‌‌కు సంబంధించిన మెషిన్లు స్టోర్​ రూంకే పరిమితమయ్యాయి. డాక్టర్లు లేకపోవడమే దీనికి కారణం.

-భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఎక్స్​రే, స్కానింగ్​ సౌకర్యం మాత్రమే ఉన్నాయి. ఆ విభాగపు డాక్టర్లు లేక అవి కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి.

-ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌‌ లేకపోవడంతో 6 నెలలుగా సీటీ స్కానింగ్ మెషిన్లు
మూలకుపడ్డాయి.

స్కానింగ్​ చేయాలా.. బయటికే..

కరీంనగర్‍ జిల్లా హస్పిటల్‍ లో సీటీ స్కాన్‍ మెషిన్‍ దాదాపు నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. నిత్యం 20, 30 రోగులు బయటి ప్రైవేటు సెంటర్లలో స్కానింగ్​ చేయించుకోవాల్సి వస్తోంది. దాంతో రోగులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. సర్కారు దవాఖాన‍ అని వస్తే ఇట్ల వేలకువేలు ఖర్చు చేయించడం ఏందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-బెల్లంపల్లి దవాఖానాలో జనరేటర్‌‌‌‌ పాడైపోయింది. జనరేటర్‌‌‌‌ రిపేర్‌‌‌‌ కారణంగా ఆపరేషన్ల కోసం రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారు.

-నిత్యం వందల మంది రోగులు వచ్చే కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌‌ మెషిన్‌‌ నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. దీంతో రోజూ 20–30 మంది రోగులు ప్రైవేటులోనే స్కానింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది.

-దేవరకొండలో 50 పడకల సర్కారు దవాఖానా ఉన్నా చిన్నపాటి రక్తపరీక్షలకు కూడా ప్రైవేటు ల్యాబ్​లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దేవరకొండ చుట్టపక్కల గిరిజన ప్రాంతాల నుంచి పేదలంతా ఈ ఆస్పత్రికే వస్తారు. సీజనల్, వైరల్​ జ్వరాల సమయంలో వారంతా ప్రైవేటు ల్యాబ్​లకు వేల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది.

-వనపర్తి కొత్త జిల్లాగా ఏర్పాటైనా ఇక్కడి ఏరియా ఆస్పత్రి పరిస్థితి మారలేదు. 170 బెడ్లు ఏర్పాటు చేసినా, తగిన సంఖ్యలో సిబ్బంది, పరికరాలు లేవు. 49 మంది డాక్టర్లకు 11 మందే ఉన్నారు. ఎక్స్ రే ఫిల్మ్ ల కొరత కారణంగా రోగులకు ఎక్స్ రే ఫిల్మ్ లు ఇవ్వడం లేదు. సిబ్బందికొరత కారణంగా కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గర్భిణులకు స్కానింగ్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఆస్పత్రిలో ఐసీయూ లేకపోవడం గమనార్హం.

పిల్లల పరిస్థితేమైతది?

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో ఫొటో థెరపీ మెషిన్లు పనిచేయడం లేదు. ఇక్కడ నెలకు 300కుపైగానే ప్రసవాలు అవుతుంటాయి. తక్కువ బరువుతో, నెలలు నిండకుండా, ఇతర అనారోగ్య కారణాలతో పుట్టే పిల్లలకు ఫోటో థెరపీ అవసరం. కానీ ఇక్కడి మెషిన్లలో చాలా పాడైపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి.

-భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏడాదిగా సీ-ఆర్మ్‌‌ యంత్రం మూలనపడటంతో ఆర్థో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులందరికీ ఈ ఆస్పత్రే దిక్కు. సీఆర్మ్​ పరికరం పనిచేస్తేనే ఎముకలు, కీళ్ల ఆపరేషన్లు జరుగుతాయి. యాక్సిడెంట్​ కేసుల పరిస్థితి మరీ దారుణం. ఆపరేషన్లు అవసరమైనవారు ప్రైవేటుకు వెళ్లాల్సిందేనని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్​ థియేటర్‍లో మూడు సక్షన్​ పరికరాలు ఉండాలి. కానీ ఒకటే ఉంది. ఇక పేషంట్లను ఆపరేషన్​ చేసే బెడ్​ కూడా దెబ్బతిన్నది. ఇక్కడే కొత్తగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో అవసరమైన యంత్రాలు లేక, నేటికీ ఆపరేషన్‌‌ థియేటర్‌‌‌‌ ప్రారంభించలేదు. ఈ ఆస్పత్రిలో 65 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. 13 మందే ఉన్నారు. అందులోనూ ముగ్గురు 24 గంటల ఆసుపత్రిలో పనిచేస్తారు. ఒక్కరిని ఇటీవలే మణుగూరు ఏరియా ఆసుప్రతికి డిప్యుటేషన్‍పై పంపారు.