మంత్రి ప్రారంభించి 20 రోజులైతున్నా క్లాసులు చెప్పట్లే

V6 Velugu Posted on May 14, 2022

  • మంత్రి సబిత ప్రారంభించి 20 రోజులైతున్నా క్లాసులు చెప్పట్లే
  • ఓయూ, పాలమూరు తప్ప మిగతా వర్సిటీల్లో షురూ కాలే
  • శాతవాహనలో వారానికి రెండు రోజులే క్లాసులు
  • సమ్మర్​ హాలిడేస్​ అంటూ వర్సిటీల హాస్టళ్లకు తాళం

హైదరాబాద్​, వెలుగు: యూనివర్సిటీల్లో జాబ్​లకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు సర్కార్​ కోచింగ్​ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. గ్రూప్​ 1, ఎస్సై, కానిస్టేబుల్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలై రెండు వారాలు గడస్తున్నా చాలా వర్సిటీల్లో క్లాసులను మొదలు పెట్టలేదు. పోటీ పరీక్షల కోసం ఏప్రిల్​ 20న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనివర్సిటీల్లో ఫ్రీ కోచింగ్​ను స్టార్ట్​ చేసినా.. ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలు మినహా ఎక్కడా పూర్తి స్థాయిలో క్లాసులు జరగట్లేదు. సెమిస్టర్​ ఎగ్జామ్స్​, వేసవి సెలవుల పేరుతో ఆయా వర్సిటీల్లో క్లాసును బంద్​పెట్టారు. శాతవాహన వర్సిటీలో వారంలో రెండు రోజులే (శని, ఆదివారాలు) క్లాసులు నిర్వహిస్తున్నారు. కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల్లో క్లాసులు మొదలవ్వనే లేదు. అసలు క్లాసులు పెట్టడం లేదని, ఒకవేళ పెట్టినా ఒకట్రెండు రోజులే నిర్వహిస్తుండటంతో సిలబస్​ ఎలా పూర్తి చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 
ఫుల్​ డిమాండ్​
జాబ్స్​కు వరుసగా నోటిఫికేషన్లు వస్తుండడంతో విద్యార్థులంతా చాలా సీరియస్​గానే ప్రిపేర్​ అవుతున్నారు. కొందరైతే పీజీ పూర్తయినా ప్రిపరేషన్​ కోసమే మరో పీజీకి అడ్మిషన్​ తీసుకుంటున్నారు. వర్సిటీ ప్రొఫెసర్లే సబ్జెక్టులను బోధిస్తుండడంతో కోచింగ్​కు వెళ్లేందుకు చాలా మంది ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ఓయూలో క్లాస్​ రూమ్​ మొత్తం నిండిపోవడంతో ప్రత్యేకంగా ఇంకో సెక్షన్​నే ఓపెన్​ చేశారంటేనే వర్సిటీల్లో కోచింగ్​ క్లాసులకు ఎంత డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, చాలా యూనివర్సిటీలు మాత్రం వేసవి సెలవుల పేరు చెప్పి హాస్టళ్లను మూసేశాయి. వాస్తవానికి ఎండా కాలం సెలవుల్లో యూనివర్సిటీల మెస్​లను బంద్​పెట్టినా హాస్టల్​ రూములను మాత్రం ఓపెన్​ చేసే ఉంచేటోళ్లు. దీంతో స్టూడెంట్లు హాస్టల్​ రూముల్లోనే వండుకోవడమో లేదంటే బయట తినడమో చేసేవారు. కానీ, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు పూర్తిగా హాస్టళ్లనే మూసేస్తూ వీసీలు సర్క్యులర్​ జారీ చేశారు. హాస్టళ్లను వెంటనే ఖాళీ చేయాలని, ఆన్​లైన్​లో కోచింగ్​ క్లాసులు వినాలంటూ కేయూ వీసీ ఉత్తర్వులిచ్చారు. విద్యార్థులు ఆందోళన చేయడంతో ఈనెల 24 వరకు హాస్టళ్లుంటాయని ప్రకటించారు. మరి, ఆ తర్వాత తమ పరిస్థితేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్​లోని తెలంగాణ వర్సిటీకి ఈ నెల 10 నుంచి సమ్మర్​ హాలీడేస్​ ఇవ్వడంతో స్టూడెంట్లు ఇంటి 
బాట పట్టారు.  

కోచింగ్​ తీసుకునే స్థోమత లేదు

నేను గ్రూప్స్​కు ప్రిపేర్​ అవుతున్నా. ప్రైవేటులో కోచింగ్​ తీసుకునే స్థోమత నాకు లేదు. యూనివర్సిటీలో కోచింగ్​ ఇస్తున్నారంటే సంతోషించా. కానీ ఇప్పటి వరకు క్లాసులే మొదలుపెట్టలేదు. మా లాంటోళ్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కోచింగ్​ ప్రారంభించాలి.  
- కామగోని శ్రవణ్​, ఎంసీజే, కేయూ

Tagged candidate, University, Government coaching

Latest Videos

Subscribe Now

More News