గ్లోబల్ సిల్వర్ మార్కెట్‌లో ఇప్పుడు ఒకటే టాక్.. ‘ఇండియా దిగుమతులు తగ్గించేసింది’ అని. అవును ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని వినియోగించే భారతదేశం ఒక్కసారిగా తన దిగుమతులకు బ్రేకులు వేసింది. మే నెలలో భారత వెండి దిగుమతులు ఏకంగా 87% పడిపోయి.. 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దూకుడు నిర్ణయాలు, కఠినమైన ఆంక్షల వల్లే వెండి మార్కెట్‌లో సైలెంట్ షాక్ నమోదైంది.
గతేడాది మే నెలలో రూ.5వేల 380 కోట్లుగా ఉన్న వెండి దిగుమతులు, ఈ ఏడాది మే నాటికి కేవలం రూ.719 కోట్లకు పరిమితమయ్యాయి. పరిమాణం పరంగా చూస్తే.. ఇది 94% భారీ పతనంతో కేవలం 33 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఫిబ్రవరి 2023 తర్వాత ఈ స్థాయిలో దిగుమతులు పడిపోవడం ఇదే మొదటిసారి అని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లెక్కలు బయటపెట్టాయి.
దిగుమతుల భారీ పతనానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విధించిన ఉక్కుపాదమే. మే మధ్యలో దాదాపు అన్ని రకాల వెండి దిగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇటీవల సిల్వర్ గ్రెయిన్, పౌడర్‌లను కూడా నియంత్రిత జాబితాలోకి చేర్చింది. వీటికి ముందస్తు అనుమతులు తప్పనిసరి చేసింది. దీనికి తోడు విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వెండి, బంగారంపై దిగుమతి సుంకాలను 6% నుండి ఏకంగా 15%కి పెంచేసింది.
భారతదేశం తన వెండి అవసరాల్లో 80% కంటే ఎక్కువ యూఏఈ, బ్రిటన్, చైనాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్లను జస్ట్ వెండి దిగుమతి కోసం ఖర్చు చేసింది. ప్రస్తుత ఆంక్షల వల్ల దిగుమతులు తగ్గడం భారత వాణిజ్య లోటును తగ్గించడానికి, రూపాయి విలువపై ఒత్తిడిని అదుపు చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
దేశీయంగా ఆభరణాలు, కాయిన్స్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండికి విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ‘సిల్వర్ ఈటీఎఫ్’లలో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై కష్టంగా మారిందని, దీనివల్ల స్థానికంగా వెండిపై ప్రీమియం ధరలు పెరగడం మొదలైందని ముంబైకి చెందిన బులియన్ డీలర్లు చెబుతున్నారు.
