అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగడం లేదని గవర్నమెంట్ డాక్టర్లు ఆరోపించారు.

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగడం లేదని గవర్నమెంట్ డాక్టర్లు ఆరోపించారు.
  •  పారదర్శకంగానిర్వహించాలని డిమాండ్​
  •  కోఠిలోని డీఎంఈ  కార్యాలయం ముందు ఆందోళన
  • 900 పోస్టింగ్​లు ఉంటే183 ఖాళీలనే చూపుతున్నారని ఆరోపణ

బషీర్ బాగ్, వెలుగు: అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగడం లేదని గవర్నమెంట్ డాక్టర్లు ఆరోపించారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు  డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో  కొత్తగా ప్రకటించిన మెడికల్ కాలేజీల్లో పోస్టింగ్ లతో పాటు  ఖాళీగా ఉన్న 900 పోస్టింగ్ లను చూపించడంలేదని, కేవలం కొన్నింటిని మాత్రమే కౌన్సెలింగ్ లో చూపిస్తున్నారని వారు ఫైర్​అయ్యారు. జీవో  నెంబర్ 273,  నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం  కౌన్సెలింగ్​నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్​డాక్టర్లు కౌన్సెలింగ్​ను బహిష్కరించారు.  కాగా, డాక్టర్లు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 900 పోస్టులు ఖాళీగా ఉంటే  కొన్ని పోస్టింగ్ లు మాత్రమే కౌన్సెలింగ్ లో చూపిస్తున్నారని మండిపడ్డారు. జనగామ, కామారెడ్డి ప్రాంతాలలో ఉన్న ఖాళీలను చూపించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పని చేయడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

కొత్త కాలేజీలకు వెళ్లేందుకు సిద్ధం

రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ తెలిపారు. రాష్ట్రంలో 900 ఖాళీలు ఉండగా 183 ఖాళీలు మాత్రమే కౌన్సెలింగ్ లో చూపెడుతున్నారని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కౌన్సెలింగ్ లో చూపించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన డిఎంఈ  ప్రభుత్వంతో చర్చించి కౌన్సెలింగ్​ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు డా.అన్వర్ తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే కౌన్సెలింగ్​: డీఎంఈ

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా అమలు చేస్తున్నామని డీఎంఈ కార్యాలయం ప్రకటించింది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కౌన్సెలింగ్​ నిర్వహిస్తున్నట్లు డీఎంఈ తెలిపింది.ఉస్మానియాలో జనరల్ సర్జరీలో 31 మంది, పీడియాట్రిక్​లో 55 మంది, అనస్థీషియాలో 25 మంది,  జనరల్ మెడిసిన్‌‌ 27 మంది ఫ్యాకల్టీలు ఉన్నారని, గాంధీలో  జనరల్ మెడిసిన్ 23 మంది,  జనరల్ సర్జరీ 26 మంది, 31 మంది అనస్థీషియా ఫ్యాకల్టీలు ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించే విధంగా పోస్టింగ్​లను ఇస్తున్నట్లు స్పష్టం డీఎంఈ స్పష్టం చేసింది.