సర్కార్​ ఉద్యోగులకు పీఎఫ్ పైసలొస్తలె!

సర్కార్​ ఉద్యోగులకు పీఎఫ్ పైసలొస్తలె!

విత్ డ్రాల కోసం నెలల తరబడి ఎదురుచూపులు

ఈఎల్స్​ సరెండర్​ చేసినా డబ్బులు ఇస్తలేరు

అవసరానికి డబ్బు అందట్లేదని ఉద్యోగుల ఆవేదన

 తిరుమల్ పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్ లో సూపరింటెండెంట్ స్థాయి ఆఫీసర్​. అత్యవసరమై ఈ ఏడాది మేలో జీపీఎఫ్‍ అమౌంట్ విత్ డ్రా కోసం అప్లై చేసుకున్నారు. ట్రెజరీలో బిల్ పాస్ అయి ఆరు నెలలు దాటింది. ఇంకా ఆయన అకౌంట్ లో డబ్బు జమ కాలేదు. దాంతో బయట అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పుకు నెలనెలా మిత్తి కడుతూ ఇబ్బందిపడుతున్నారు.

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కు జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు ఉన్నా అవసరానికి అందడం లేదు. కష్టకాలంలో అత్యవసరం వచ్చినా కూడా తమ సొంత జీపీఎఫ్‍‍ అకౌంట్ల​నుంచి సొమ్ము తీసుకోలేకపోతున్నారు. డబ్బుల్లేవంటూ సర్కారు చేతులెత్తేయడంతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ కు రావాల్సిన ఇంక్రిమెంట్ ఎరియర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రావాల్సిన బెనిఫిట్స్​ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జీపీఎఫ్ డబ్బులు అందకపోవడంతో ఉద్యోగులు బయట అప్పులు చేసి, నెలనెలా మిత్తీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది . తమ జీపీఎఫ్ సొమ్మును వాడుకుంటున్న సర్కారు.. తమ అవసరాలకు ఇవ్వడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎవరైనా ఎంప్లా యీ, పెన్షనర్ చనిపోయినప్పడు అంత్యక్రియల కోసం ప్రభుత్వం వారి ఫ్యామిలీకి రూ.20 వేలు ఇచ్చేదని, ఆరు నెలలుగా ఈ బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలలుగా ఎదురుచూపులే..

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి రెగ్యులర్ ఎంప్లాయీస్ 2 లక్షల 60 వేలకుపైగా ఉంటారు. జీతాల నుంచి ప్రతినెలా కొంత మొత్తం వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్ ) ఖాతాల్లో జమ అవుతూ ఉంటుంది . రిటైరయ్యాక ఏకమొత్తంగా ఈ సొమ్మును అందజేస్తారు. అయితే ఎంప్లాయీస్ కు ఏదైనా అత్యవసరం ఉంటే.. జీపీఎఫ్ నుంచి సొమ్ము డ్రా చేసుకునే చాన్స్​ ఉంది. ఎంప్లాయీస్ దీనికి అప్లై చేసుకున్న కొద్దిరోజుల్లోనే సర్కారు వారి అకౌంట్లలో సొమ్ము జమ చేస్తుంటుంది . కానీ ప్రస్తుత ఫైనాన్షి యల్ ఇయర్లో మాత్రం నెలల తరబడి డబ్బులు ఇవ్వడం లేదు. గత ఆరు నెలల్లో వేల మంది ఉద్యోగులు జీపీఎఫ్ విత్ డ్రా కోసం అప్లై చేసుకున్నారు. వీటికి సంబంధించి ఆయా జిల్లా ల్లోని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో బిల్లులు పాస్ అయినా.. ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ కాలేదు. ఆన్ లైన్ లో చెక్ చేస్తే ‘అండర్ గవర్నమెంట్ అప్రూవల్’ అని చూపిస్తోంది . సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్నిబిల్లులు అయితే మార్చి, ఏప్రిల్ నుంచీ పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు.

రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్​అందట్లే..

ప్రభుత్వ ఉద్యోగులు రిటైరయ్యాక ఇచ్చే బెనిఫిట్స్​ కూడా కొన్ని నెలలుగా అందడం లేదు. సాధారణంగా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కు రెండు నెలల ముందే బెనిఫిట్స్​ కోసం అప్లై చేసుకుంటారు. రిటైర్ అయ్యే నాటికి అధికారులు వాటిని ప్రాసెస్ చేస్తారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా ఉద్యోగులకు రిటైరైన రోజే గ్రాట్యుటీ, జీపీఎఫ్ సహా అన్ని రకాల బెనిఫిట్స్​అందజేస్తామని ప్రకటించారు. అంతేకాదు వారిని ఘనంగా సన్మానించి , ప్రభుత్వ ఖర్చుతో కారులో ఇంటి వద్ద దింపాలని అధికారులను ఆదేశించారు. కానీ అవి అమల్లోకి రాలేదు. రిటైరైన రోజే బెనిఫిట్స్ ఇవ్వడం, కారులో దింపి రావడం రెండూ కలగానే మిగిలాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. బెనిఫిట్స్​ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని వాపోతున్నారు. బెనిఫిట్స్​ సొమ్మును సర్కారు నెలల తరబడి ఉంచుకుని, వడ్డీ రూపంలో కోట్లు మిగుల్చుకుంటోందని, తమను ఇబ్బంది పెడుతోందని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మూడు వేల మందికిపైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బెనిఫిట్స్​ చెల్లించాల్సి ఉందని అంచనా.

ఇంక్రిమెంట్ల ఎరియర్స్​దీ అదే పరిస్థితి

బేసిక్ శాలరీని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ ఎరియర్స్ అందుకుంటారు. ఈ ఎరియర్స్​ కూడా ఆరు నెలలుగా అందడం లేదు. ఏటా ఉద్యోగులకు వచ్చే 30 ఈఎల్స్​(ఎర్న్​డ్ లీవ్స్)లో సాధారణంగా15 లీవ్స్​ను సరెం డర్ చేసి సొమ్ము తీసుకుంటుంటా రు. ఈసారి ఈఎల్స్ సరెండర్ చేసి నెలలు గడుస్తున్నా అమౌంట్ చేతికి రా లేదని ఎంప్లా యీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఇయ్యాలె..

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలు ఎప్పుడు వస్తా యో తెలియని పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తమ జీపీఎఫ్‍ ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి అనుమతి వచ్చినా గవర్నమెంట్ రిలీజ్ చేయడం లేదు. ఈఎల్స్ సరెండర్ చేసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా అమౌంట్ ఇవ్వట్లేదు. సప్లిమెంటరీ వేతనాలు రిలీజ్ చేయట్లేదు. రాష్ట్ర సర్కారు వెంటనే చొరవ తీసుకొని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు చెల్లిం పులు చేయాలి. – రేవెల్లి తిరుపతి, టీచర్స్ యునైటెడ్ ఫోరం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు.