- హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ జోన్ల ఏర్పాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- కొత్తగా ముగ్గురు ఈడీల నియామకం
- జాయింట్ ఎండీగా మాయాంక్ మిట్టల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ పరిధిని విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిధిలోని నీటి సరఫరా, మురుగునీటి (సివరేజ్) నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జలమండలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్జోన్లు ఏర్పాటు చేస్తూ ఈడీలను నియమించింది. ప్రస్తుతం జలమండలి 1,450 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచినీటిని సరఫరా చేస్తుండగా.. 650 చదరపు కిలోమీటర్లలో సీవరేజ్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.
కొత్తగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచినీటి సరఫరా , సివరేజ్ పనులు చూడనున్నది. ఈ విస్తరణతో ఓఆర్‌ఆర్ పరిధిలోని కొత్త ప్రాంతాల్లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేందుకు జలమండలి చర్యలు తీసుకోనున్నది. అదేవిధంగా నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలతో పాటు సంబంధిత అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా ప్రాధాన్యతగా చేపట్టనుంది.
