- సీఎం ఆదేశాలతో భద్రత కట్టుదిట్టం
- ఎస్పీఎఫ్ సిబ్బందిని ఇవ్వాలని పోలీస్ శాఖకు లెటర్
- త్వరలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
- జియో ఫెన్సింగ్ కు నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో చెరువుల రక్షణకి ఇప్పటికే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఉపయోగించుకుంటున్న హైడ్రా ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం 248 మంది లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఉపయోగించుకుంటున్న హైడ్రా చెరువుల వద్ద షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున గార్డ్స్‌ను ఏర్పాటు చేసింది.
ఇటీవల నల్లచెరువు ప్రారంభోత్సవ సమయంలో చెరువుల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) కోసం సిబ్బందిని కేటాయించాలని పోలీస్ శాఖకు హైడ్రా లెటర్రాసింది. కొద్ది రోజుల్లో ఈ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.
టెక్నాలజీతో నిఘా..
చెరువుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసేందుకు తొలిదశలో కీలకమైన 650 చెరువుల దగ్గర 950 ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇవి సోలార్ పవర్‌తో పనిచేస్తూ ఐపీ టెక్నాలజీ ఆధారంగా నిరంతరం పర్యవేక్షిస్తాయి. వీటిని హైడ్రా కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తారు.
బుద్ధభవన్‌లోని హైడ్రా ఆఫీసు నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ రెండు కేంద్రాల్లో 24 గంటల నిఘా ఉంచేందుకు సిబ్బందిని నియమించనున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు లేదా చెరువుల పూడ్చివేత ప్రయత్నాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా హైడ్రా
అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
ఫ్యూచర్లో సీసీ కెమెరాలు, డ్రోన్లు
భవిష్యత్తులో డ్రోన్లతో నిఘా పెట్టడానికి, జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా ప్లాన్చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటు దేశ, విదేశాల సంస్థలతో సంప్రదింపులు జరిపి శాటిలైట్ టెక్నాలజీ వినియోగించుకోవాలని చూస్తున్నారు.
జియో ఫెన్సింగ్ ద్వారా చెరువుల హద్దులను కచ్చితంగా గుర్తించి, ఎవరైనా ఆ పరిధిలోకి చొరబడి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ నుంచి సరిపడా సిబ్బంది వచ్చిన తర్వాత ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.
