లాభదాయక సాగు దిశగా సర్కారు అడుగులు..గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

లాభదాయక సాగు దిశగా సర్కారు అడుగులు..గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
  • మేలు రకాల వంగడాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, రైతులను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదలకు సన్న బియ్యం అందేలా చూడాలని ఆయన తెలిపారు. అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​ రావులతో కలిసి డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.   రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వానకాలం సాగు, వ్యవసాయ ఉత్పత్తిపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మార్కెట్‌‌లో మంచి డిమాండ్ ఉన్న బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్‌‌ఆర్ 15048), కెఎన్‌‌ఎం-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ వంటి మేలుజాతి వరి వంగడాలను ఎక్కువగా సాగు చేయాలని సూచించారు. వీటి సాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఈ వంగడాలపై గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు తగ్గిస్తోందని రైతు కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది.

ముఖ్యంగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఉంటే  గంట పాటు మీకు అందుబాటులో ఉంటా!తాను హైదరాబాద్​లో ఉంటే గంట పాటు అందుబాటులో ఉంటానంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భట్టి విక్రమార్క లేఖలు రాస్తున్నారు. హైదరాబాద్​లో ఉంటే సెక్రటేరియట్​లో లేదా ప్రజాభవన్​లో ఉంటానని సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు అందుబాటులో ఉంటానని లేఖలో తెలిపారు. ప్రభుత్వ ఎంబ్లంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు సంతకంతో కూడిన ఈ లేఖలు బుధవారం సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.