
హైదరాబాద్, వెలుగు: సిటీ శివారులోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇండ్లను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అదే రోజును ఆరుగురు(ఆరు సామాజిక వర్గాలకు చెందిన)లబ్ధిదారులకు సీఎం పట్టాలు అందజేయనున్నట్లు సమాచారం. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
మొదట సీఎం కేసీఆర్ చేత ప్రారంభించి, తర్వాత లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేసేందుకు అధికారులు ప్లాన్ చేస్లున్నట్లు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు కొల్లూరులో నిర్మించిన ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ మొత్తం15,660 డబుల్ బెడ్రూమ్ఇండ్లు నిర్మించగా, మొత్తం 7లక్షల9వేల718 అప్లికేషన్లు వచ్చాయి. ఇవి కాకుండా వేల మంది మాన్యువల్‌గా అధికారులను కలిసి అప్లికేషన్లు ఇచ్చారు. మొత్తంగా 3 లక్షల50 వేల అప్లికేషన్లు సరైనవిగా అధికారులు గుర్తించగా, ఇందులో ఎంత మందికి కొల్లూరులో ఇండ్లు కేటాయిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.