- గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిర్వాకం
- వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికుల కోటాలో అక్రమంగా లబ్ధి
- సెర్ప్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్‌తో వెలుగులోకి
- ఈ నెల నుంచే పింఛన్ల నిలిపివేతకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు ఖజానా నుంచి నెలనెలా జీతాలు తీసుకుంటూ.. పింఛన్లను కూడా తమ ఖాతాలో వేసుకుంటున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న సుమారు 500 నుంచి 600 మంది ఉద్యోగుల పింఛన్లను ఈ నెల నుంచి నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా పీఆర్, ఆర్డీ సహా పలు శాఖల్లోని కొందరు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది అటు జీతం, ఇటు పింఛన్ రెండూ తీసుకుంటున్నారు.
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల కోటాలో వీరు అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. దీనిపై ఇటీవల సెర్ప్ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ పింఛన్లు కాజేస్తున్నట్లు తేలడంతో తక్షణమే వారి పింఛన్లను నిలిపివేయాలంటూ ఆయా శాఖలకు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. సెర్ప్ నివేదిక ఆధారంగా అక్రమంగా పింఛన్లు పొందుతున్న ఉద్యోగుల జాబితాను ఆయా జిల్లాల డీఆర్డీఓలకు పంపించారు.
ఈ నెల నుంచి వారికి పింఛన్ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా ఇప్పటివరకు అక్రమంగా తీసుకున్న పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని భావించినా.. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ కావడంతో.. అక్రమ పింఛనుదారుల్లో గుబులు మొదలైంది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
42.67 లక్షల పింఛన్‌దారులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 42.67 లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు. 11 కేటగిర్లీలో ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నది. దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుండగా.. మిగతా వారికి రూ.2,016 ఇస్తున్నది. 2024–25లో 42.67 లక్షల మందికి రూ.14,628.91 కోట్లు బడ్జెట్ కేటాయించగా.. ఇందులో ప్రతి నెలా రూ.1000.47 కోట్లు పింఛన్‌దారులకు ప్రభుత్వం చెల్లిస్తున్నది.
