నాలుగోరోజు కూడా సంక్రాంతి రష్.. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్

నాలుగోరోజు కూడా సంక్రాంతి రష్.. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర  ట్రాఫిక్ జామ్

సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం పల్లె బాట పట్టింది. శనివారం ( జనవరి 10 ) నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆదివారం వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎల్బీ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్, శివారులోని ఉప్పల్ రింగ్​ రోడ్, కూకట్​పల్లి, ఆరంఘర్ చౌరస్తా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, లింగంపల్లి, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ ,హయత్ నగర్ లోని బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.ఇక సెలవులు ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత కూడా నేషనల్ హైవేలపై రద్దీ తగ్గలేదు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్  టోల్ ప్లాజా దగ్గర నాలుగోరోజు కూడా వాహనాల రద్దీ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇప్పటికే  దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు  సిటీని వదిలి ఊళ్లకు వెళ్లారని సమాచారం. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నివారణ చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రతి 3 సెకండ్లకు ఒక్కొక్క వాహనం కదిలేలా ఏర్పాట్లు చేపట్టారు టోల్ సిబ్బంది. టిజిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా జనం భారీగా తరలివస్తుండటంతో ఆదివారం బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సి వచ్చింది. 

ఇదే అదనుగా ప్రైవేటు వెహికల్స్ భారీగా చార్జీలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రయాణికులు భారీగా తరలిరావడంతో ఆయా రూట్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అర్టీసీ   ఏర్పాట్లు  చేసిందని అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా వెళ్లే ప్రయాణికుల కోసం బస్సుల సంఖ్య పెంచినట్లు తెలిపారు అధికారులు.