లోకల్​ బాడీస్​ సర్కార్​ పిడికిట్ల

లోకల్​ బాడీస్​ సర్కార్​ పిడికిట్ల

పంచాయతీలు, పరిషత్​లు, మున్సిపాలిటీల్లో అడిషనల్​ కలెక్టర్లదే పెత్తనం?
సర్పంచ్​లు, చైర్​పర్సన్లు, మేయర్లపై వేటుకు సిఫారసు చేసే పవర్​ కూడా వీరికే!
ఇప్పటికే 14 జిల్లాలకు నియామకం..
త్వరలో మిగతా జిల్లాలకు
విధులు, బాధ్యతలపై నేడు
కలెక్టర్ల మీటింగ్​లో సీఎం వెల్లడించే చాన్స్​
పాలన వ్యవహారాల్లో వేగంగా మార్పులు

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్​లు, జిల్లా పరిషత్​లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్ని లోకల్​ బాడీస్​ను రాష్ట్ర ప్రభుత్వం తన పిడికిట్లోకి తీసుకోనుంది. ఇందుకోసం పాలన వ్యవహారాల్లో వేగంగా మార్పులు చేస్తోంది. సర్పంచ్​లు, మండల పరిషత్​ చైర్​పర్సన్లు, జడ్పీ చైర్​పర్సన్లు, మున్సిపల్​ చైర్​పర్సన్లు,  మేయర్ల పనితీరును బేరీజు వేసేందుకు జిల్లా స్థాయిలో లోకల్​బాడీస్​ కోసం అడిషనల్​ కలెక్టర్​ పోస్టును క్రియేట్​చేసింది. 14  జిల్లాలకు వీరిని నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో మిగతా జిల్లాల్లో కూడా నియమించనుంది. ఇకపై ఈ అడిషనల్ కలెక్టర్ల కనుసన్నల్లోనే లోకల్​ బాడీస్​ పని చేయాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీ రాజ్​ చట్టం, కొత్త మున్సిపల్​ చట్టం ప్రకారం సర్పంచ్, మండల పరిషత్​ చైర్​పర్సన్​, జడ్పీ చైర్​పర్సన్​, మున్సిపల్ చైర్​పర్సన్, మేయర్​ పని చేస్తున్నారా? లేదా? అనేది వీళ్లే ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నట్లు తెలిసింది. పని తీరు సరిగా లేని ప్రజాప్రతినిధులపై వేటు వేయాలని సిఫారసు చేసే అధికారం కూడా వీరికే ఉండనున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.  గ్రేటర్​ హైదరాబాద్​ మాత్రం మున్సిపల్​ శాఖ కమిషనర్  పర్యవేక్షణలో ఉంటుంది.

విధులు, బాధ్యతలు లేకుండా పోస్టు

అడిషనల్​ కలెక్టర్ల పోస్టును రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా క్రియేట్​ చేసింది. ఐఏఎస్ ల బదిలీల సందర్భంగా ఆదివారం రాత్రి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. అడిషనల్​ కలెక్టర్ల బాధ్యతలేమిటి? వీరి విధులేమిటి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. సర్వీస్​ రూల్స్ విడుదల చేయలేదు. సాధారణంగా కొత్త పోస్టును ఏర్పాటు చేసినప్పుడు ఆ పోస్టులో ఉండే అధికారి బాధ్యతలు, విధులపై సర్వీస్ రూల్స్ విడుదల చేయాల్సి ఉంటుంది. తామేం చేయాలో తెలియదని, పోస్టింగ్​ ఉత్తర్వులే వచ్చాయని ట్రాన్స్​ఫర్​ ఆర్డర్​ చూసిన ఓ ఆఫీసర్​ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్ లో జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ అడిషనల్​ కలెక్టర్ల బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది.

ఒకే అధికారి చేతిలోకి జిల్లా లోకల్ బాడీస్

జిల్లా స్థాయిలోని లోకల్​ బాడీస్​ బాధ్యతలు మొత్తం అడిషనల్​ కలెక్టర్​ చేతిలోకి రానున్నాయి. ఆయన పర్యవేక్షణలోనే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్  పని చేయాల్సి ఉంటుంది. నిధుల వినియోగం, విధుల నిర్వహణపై అడిషనల్​ కలెక్టర్​ మానిటరింగ్ ఉంటుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇప్పటివరకు పంచాయతీలు జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో ఉండేవి. మండల పరిషత్, జిల్లా పరిషత్​లు  జడ్పీ సీఈవో మానిటర్​ చేసేవారు. వీరిద్దరూ జిల్లా కలెక్టర్​కు రిపోర్ట్​ చేసేవారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు కలెక్టర్​కు సంబంధం లేకుండా నేరుగా కమిషనర్ అండ్  డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు నివేదించేవారు. స్థానిక సంస్థలకు ఒక్కో జిల్లా అధికారి ఇన్​చార్జ్​గా ఉండటంతో పాలన పరమైన నిర్ణయాలు వెంటనే అమలు చేయడం కష్టంగా మారిందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అందుకని జిల్లాలోని లోకల్​ బాడీస్​ పర్యవేక్షణను ఒకే అధికారి పరిధిలో ఉంచితే.. ఈ జాప్యం  ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే స్పెషల్​గా లోకల్​ బాడీస్​ కోసం అడిషనల్​ కలెక్టర్లను నియమించిందని ఓ అధికారి చెప్పారు.

పల్లె, పట్టణ ప్రగతిపై ఫోకస్

ప్రతి నెలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రోగ్రాంలపై ప్రత్యేక దృష్టి పెడుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పారిశుధ్యం, పచ్చదనం ప్రధాన ఎజెండాగా ఉండే ఈ కార్యక్రమం అనుకున్నట్టుగా జరిగేలా అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్​) పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వహించే లోకల్​ బాడీస్​ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసే బాధ్యతను వారికే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రెవెన్యూ ప్రక్షాళన షురూ?

రెవెన్యూ శాఖలో విపరీతమైన అవినీతి ఉందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్​ఇటీవల పలుమార్లు చెప్తూ వచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ చట్టంలో ఎంఆర్వో, వీఆర్వోల అధికారాలకు కత్తెర వేయనున్నారు. ఇన్నాళ్లూ ఉన్న జాయింట్ కలెక్టర్ పోస్టును అడిషనల్​ కలెక్టర్ గా మార్చటం అందులో భాగమేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాల్లో భూమికి సంబంధించిన అంశాలను నేరుగా జాయింట్ కలెక్టర్  మానిటరింగ్ చేసేవారు. ఇప్పట్నుంచి ఆ బాధ్యతలను అడిషనల్​ కలెక్టర్​ నిర్వహిస్తారు.  ఆర్​డీవోలు, డీఆర్వోలు ఈయన డైరెక్షన్​లో పనిచేస్తారు.