ఏప్రిల్ 1 నుంచి..కరెంట్ చార్జీల్లో కొత్త బాదుడు

ఏప్రిల్ 1 నుంచి..కరెంట్ చార్జీల్లో కొత్త బాదుడు
  • ఫ్యుయెల్ కాస్ట్ అడ్జెస్ట్​మెంట్(ఎఫ్​సీఏ) పేరుతో వసూళ్లకు రంగం సిద్ధం
  • యూనిట్​పై 30 పైసల వసూలుకు డిస్కంలకు స్వేచ్ఛ 
  • కొనే ధర, నష్టానికి తగ్గట్టు మూడు నెలలకోసారి పెంచుకునే వీలు 
  • ఈఆర్సీ చట్టంలో కొత్త నిబంధనను చేర్చిన రాష్ట్ర సర్కార్  
  • వ్యవసాయ కరెంట్​కు మాత్రం మినహాయింపు

హైదరాబాద్, వెలుగు:   ఇప్పటికే కరెంట్ బిల్లుల్లో అడ్వాన్స్ కన్సంప్సన్ డిపాజిట్ (ఏసీడీ) బాదుడుతో జనం అల్లాడుతుంటే.. ఇంకో కొత్త బాదుడుకు సర్కారు రంగం సిద్ధంచేసింది. ఫ్యూయెల్ కాస్ట్ అడ్జెస్ట్​మెంట్(ఎఫ్​సీఏ) లేదా ఫ్యూయెల్ సర్ చార్జ్ అడ్జెస్ట్​మెంట్(ఎఫ్ఎస్ఏ) పేరిట వినియోగదారులపై మరింత భారం మోపేందుకు రెడీ అవుతున్నది. ఇందుకోసం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్(టీఎస్​ఈఆర్సీ) రూల్స్ లో మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులేషన్​ను ప్రభుత్వం చేర్చింది. ఆదివారం అసెంబ్లీలో దానికి సంబంధించిన గెజిట్​ను ప్రవేశపెట్టింది. ఆ రెగ్యులేషన్ ఏప్రిల్1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్​లో పేర్కొంది. కరెంట్ కొనే ధర, వినియోగదారులకు అమ్మే ధర, కరెంట్​అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ నియంత్రణ లేని అంశాలు(అన్​కంట్రోలబుల్) అని పేర్కొంటూ.. కరెంట్ కాస్ట్​కు తగ్గట్టు ఎఫ్​సీఏ చార్జీలను విధించేలా డిస్కంలకు కొత్త రెగ్యులేషన్ ద్వారా స్వేచ్ఛను ఇచ్చింది. తద్వారా 3 నెలలకోసారి కరెంట్ కొనే ధర, నష్టాల ఆధారంగా యూనిట్​కు 30 పైసల చొప్పున ఎఫ్​సీఏను వసూలు చేసుకునేందుకు  అవకాశం కల్పించింది. అంతకుమించి వసూలు చేయరాదని రెగ్యులేషన్​లో పేర్కొంది. ఎఫ్​సీఏ చార్జీలు నెగెటివ్​గా ఉంటే బిల్లు నుంచి ఆ మేరకు మినహాయించాలని వివరించింది. వ్యవసాయానికి ఇచ్చే ఎల్టీవీ(లో టెన్షన్ వోల్టేజ్) కరెంట్​కు ఎఫ్​సీఏ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ చార్జీలను సర్కారు నుంచి డిస్కంలు వసూలు చేసుకోవాలని తెలిపింది. ఒకవేళ సర్కారు ఆ బిల్లులను చెల్లించకుంటే వార్షిక ట్రూ అప్ చార్జీల్లో వాటిని ఫైల్ చేయరాదని పేర్కొంది.   

పెంచే ముందు ప్రకటన ఇయ్యాలె  

కమిషన్ ఆమోదించిన ట్రాన్స్​మిషన్(విద్యుత్ సంస్థలకు సరఫరా అయ్యే కరెంట్), డిస్ట్రిబ్యూషన్ (విద్యుత్ సంస్థల నుంచి వినియోగదారులకు సరఫరా అయ్యే కరెంట్) నష్టాలకు అనుగుణంగా ఎఫ్​సీఏ చార్జీలను లెక్కించాలని సర్కారు పేర్కొంది. వినియోగదారులకు సరఫరా చేసిన మొత్తం కరెంట్ యూనిట్లు, వ్యవసాయ కనెక్షన్ల ద్వారా వాడిన యూనిట్లను కలిపి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిన కరెంట్​లో నష్టాల ఆధారంగా వాస్తవ కరెంట్​ ధర, వాస్తవ కరెంట్ యూనిట్ల కొనుగోలును లెక్కించాలని సూచించింది. ముందుగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఎఫ్​సీఏ చార్జీలను వసూలు చేయరాదని పేర్కొంది.

బిల్లుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాలె  

వినియోగదారులకు బిల్లు ఇచ్చేటప్పుడు ఎఫ్​సీఏ చార్జీలను తప్పనిసరిగా మెన్షన్ చేయాలని రెగ్యులేషన్​లో సర్కారు తెలిపింది. పరిమితికి మించి వసూలు చేయాల్సి వస్తే తప్పనిసరిగా కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లనూ జతపరచాల్సి ఉంటుందని పేర్కొంది. అనుమతి లేకుండా పరిమితికి మించి ఎఫ్​సీఏ చార్జీలను వసూలు చేస్తే వినియోగదారులు కమిషన్​కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఒకవేళ వినియోగదారుడికి రీఫండ్​ చేయాల్సి వస్తే ఎలాంటి పరిమితి లేకుండా ఆ చార్జీలను మొత్తం రీఫండ్​ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.